‘కుక్కలకూ కౌన్సెలింగ్ ఇప్పిద్దామా? కపిల్ సిబల్’
x

‘కుక్కలకూ కౌన్సెలింగ్ ఇప్పిద్దామా? కపిల్ సిబల్’

‘ఒక పులి మనిషిని తింటే అన్నింటినీ చంపేద్దామా?’ సుప్రీంకోర్టులో ధర్మాసనం–సిబల్ మధ్య ఆసక్తికర వాదన


వీధి కుక్కల (Stray Dogs) సమస్యపై స్వయంగా (సూయో మోటో) కేసు చేపట్టిన సుప్రీంకోర్టు బుధవారం కీలక వ్యాఖ్యలు చేసింది. వీధి కుక్కల రక్షణ పేరుతో పెద్ద సంఖ్యలో పిటిషన్లు దాఖలవుతున్న తీరు పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, నగరపాలక సంస్థలు, ఇతర స్థానిక సంస్థలు యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) నిబంధనలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యాయని తీవ్రంగా ఆక్షేపించింది.
‘ప్రజలు చనిపోతున్నారు’
“ఈ ఘటనలు జరుగుతున్నాయన్న విషయం మాకు తెలుసు. పిల్లలు, పెద్దలు కుక్కల దాడులకు గురవుతున్నారు. ప్రజలు చనిపోతున్నారు,” అని ధర్మాసనం వ్యాఖ్యానించినట్లు బార్ అండ్ బెంచ్ పేర్కొంది.

ప్రతీకాత్మక చిత్రం.. సుప్రీంకోర్టు

గత 20 రోజుల్లో ఇద్దరు జడ్జీలను కుక్కలు కరిచిన ఘటనలు జరిగాయని, వారిలో ఒక జడ్జీ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కోర్టు వెల్లడించింది.
“ఒక జడ్జీ ఇప్పటికీ వెన్నెముక గాయాలతో బాధపడుతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం,” అని ధర్మాసనం పేర్కొంది.
పలురాష్ట్రాల నిర్లక్ష్యం
ఈ కేసు విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, పంజాబ్ రాష్ట్రాలు ఇప్పటివరకు కోర్టుకు కంప్లయెన్స్ అఫిడవిట్లు దాఖలు చేయలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
‘మనుషులను తినే పులి’ వాదన – కపిల్ సిబల్
పిటిషనర్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్, ఈ సమస్యను బాధ్యతాయుత సమాజాన్ని ప్రతిబింబించే విధంగా పరిష్కరించాలని వాదించారు.
“మేము కూడా కుక్కలను ప్రేమిస్తాం. ఒక పులి మనుషులను తింటే అన్ని పులులను చంపం కదా? అదే విధంగా స్టెరిలైజేషన్ జరగాలి. కుక్కల జనాభా తగ్గాలి,” అని సిబల్ అన్నారు.
“దానికి ఒక విధానం ఉంది. దాన్ని CSVR మోడల్ అంటారు. అంటే క్యాప్చర్, స్టెరిలైజ్, వ్యాక్సినేట్, రిలీజ్. ఈ విధానం ద్వారా యూపీ వంటి రాష్ట్రాల్లో కుక్కల జనాభా దాదాపు సున్నాకు చేరింది. రేబిస్ ఉన్న కుక్కలతో పాటు లేని కుక్కలను ఒకే షెల్టర్‌లో ఉంచితే అన్నింటికీ రేబిస్ వస్తుంది,” అని ఆయన వివరించారు.
ఈ సందర్భంగా ధర్మాసనం, కపిల్ సిబల్ మధ్య ఆసక్తికరమైన వాదన చోటుచేసుకుంది.
‘మీరు అదృష్టవంతులు’ – సుప్రీంకోర్టు
తాను దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎప్పుడూ కుక్కలు కరవలేదని సిబల్ చెప్పగా, ధర్మాసనం స్పందిస్తూ- “మీరు అదృష్టవంతులు. ప్రజలు, పిల్లలు కుక్కల దాడులకు గురవుతున్నారు,” అని వ్యాఖ్యానించింది.

ప్రతీకాత్మక చిత్రం.. ఏఐ క్రియేషన్

“మనమే జంతువుల పరిధిలోకి చొచ్చుకుపోతే అవి కరవచ్చు,” అని సిబల్ బదులిచ్చారు.
ఈ సందర్భంగా “కుక్కలకు కూడా కౌన్సెలింగ్ ఇవ్వడమే మిగిలింది” అని ధర్మాసనం సరదాగా వ్యాఖ్యానించగా, తాను కూడా సరదాగానే తీసుకున్నానని సిబల్ బదులిచ్చారు.
‘మీ సమాచారం పాతది’
కుక్కలు రోడ్లపై కాకుండా ప్రైవేట్ కాంపౌండ్లలో ఉంటున్నాయన్న సిబల్ వాదనపై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
“మీరు సీరియస్‌గా చెబుతున్నారా? మీ సమాచారం పాతది. నివారణే ఉత్తమం. రోడ్లపై కుక్కలు తిరక్కుండా చూడాలి. అవి కరవకపోయినా ప్రమాదాలకు కారణమవుతున్నాయి,” అని కోర్టు వ్యాఖ్యానించింది.
“అందరూ కుక్కల గురించే మాట్లాడుతున్నారు. మరి ఇతర జంతువుల సంగతేంటి? కోళ్లు, మేకల ప్రాణాలు ప్రాణాలే కాదా?” అంటూ సిబల్‌ చేసిన వాదనను ధర్మాసనం ప్రశ్నించింది. కుక్కలు కరవబోతున్నాయా లేదా అన్నది అవి దగ్గరకు వచ్చే వరకు తెలియదని, అందుకే చికిత్స కంటే నివారణే ముఖ్యమని కోర్టు స్పష్టం చేసింది.
ఇదే రోజు విచారణలో అమికస్ క్యూరియే గౌరవ్ అగర్వాల్, దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఉన్న స్ట్రే జంతువులను తొలగించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) రూపొందించినట్లు కోర్టుకు తెలిపారు.
“సుమారు 1,400 కిలోమీటర్ల మేర ప్రమాదకర మార్గాలు ఉన్నాయి. వాటిని గుర్తించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఎన్‌హెచ్‌ఏఐ చెబుతోంది,” అని ఆయన వివరించారు.
గతేడాది న్యాయమూర్తులు జె.బి. పర్డివాలా, ఆర్. మహాదేవన్లతో కూడిన ధర్మాసనం, ఢిల్లీ మున్సిపల్ అధికారులను స్ట్రే డాగ్స్‌ను పట్టుకుని షెల్టర్లలో ఉంచాలని ఆదేశించగా, జంతు హక్కుల కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. అనంతరం సుప్రీంకోర్టు ఆ ఆదేశాలను సవరించింది.
Read More
Next Story