బాక్సాఫీస్ రికార్డుల వేటలో ఉస్తాద్ శంఖారావం పూరించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ, శనివారం సాయంత్రం 6:30 గంటలకు ’ఉస్తాద్ భగత్ సింగ్‘ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ బ్లాస్ట్ కాబోతోంది. ’గబ్బర్ సింగ్‘ మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు హరీశ్ శంకర్ సిద్ధమవ్వగా, విడుదలకు ముందే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిర్మాతలకు, అభిమానులకు భారీ పవర్ బూస్ట్ ఇచ్చింది. ఒకవైపు గత్తర లేపేద్దాం అంటూ మేకర్స్ హంగామా.. మరోవైపు సర్కార్ ఇచ్చిన వెసులుబాటుతో బాక్సాఫీస్ వద్ద ఉస్తాద్ విధ్వంసం ఇప్పుడే మొదలైంది.
మైలురాయి లాంటి కాంబినేషన్.. బాక్సాఫీస్ వద్ద ప్రభంజనమే
పవన్ కల్యాణ్ కెరీర్‌లో గబ్బర్ సింగ్ సినిమా ఒక తిరుగులేని మైలురాయి. వరుస ఫ్లాపులతో ఉన్న సమయంలో వచ్చిన ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఇప్పుడు మళ్లీ అదే దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కల్యాణ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హరీశ్ శంకర్ మార్క్ మాస్ ఎలిమెంట్స్, పవన్ మేనరిజమ్స్ తోడైతే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
టికెట్ ధరలకు ఏపీ ప్రభుత్వం పవర్ బూస్ట్
సినిమా విడుదలకు ముందే నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు అందించింది. ఉస్తాద్ భగత్ సింగ్ టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ శుక్రవారం అధికారికంగా జీవో జారీ చేసింది.
మొదటి 10 రోజుల పాటు: సింగిల్ స్క్రీన్లలో అదనంగా రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 పెంచుకోవచ్చు.
బెనిఫిట్ షోలు: ఇక మార్చి 19న తెల్లవారుజామున ప్రదర్శించే స్పెషల్ షోల కోసం టికెట్ ధరను రూ. 500గా నిర్ణయించారు. ఈ నిర్ణయంతో సినిమా వసూళ్ల రికార్డులు మొదటి రోజే చెల్లాచెదురు అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ఉగాది కానుకగా మార్చి 19న ఉస్తాద్ జాతర
మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, ఉగాది పండుగ సందర్భంగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. శ్రీలీల, రాశీ ఖన్నా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మాస్ బీట్లు అందించారు. నేటి ట్రైలర్ విడుదలతో చిత్ర బృందం ప్రమోషన్లను మరింత వేగవంతం చేయనుంది. మొత్తానికి ఉగాది పండుగకు ముందే పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఉస్తాద్ రూపంలో పెద్ద పండగ రాబోతోంది.