
పవన్ కల్యాణ్ శాఖలో ఖజానా ఖాళీ.. జీతాలకూ పైసల్లేవు
పవన్ శాఖలో ఖజానా ఖాళీ పట్ల హైకోర్టులో సంచలన మెమో దాఖలు చేసిన అధికారులు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్న పంచాయతీ రాజ్ శాఖలో నిధుల గలగలలు ఆగిపోయాయా? కనీసం ప్రజాప్రతినిధుల కడుపు నింపేందుకు కూడా బడ్జెట్ లేని దుస్థితిలో శాఖ కొట్టుమిట్టాడుతోందా? అంటే అవుననే అంటోంది హైకోర్టులో సమర్పించిన తాజా మెమో. 2024 జూన్ నుంచి తమకు రావాల్సిన గౌరవ వేతనాలు అందడం లేదని వైఎస్సార్ జిల్లాకు చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కోర్టు మెట్లు ఎక్కగా, అధికారుల నుంచి వచ్చిన సమాధానం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ’మా దగ్గర బడ్జెట్ లేదు.. అందుకే జీతాలు ఇవ్వలేకపోయాం‘ అంటూ పంచాయతీ రాజ్ సీఈవో హైకోర్టులో పబ్లిగ్గా చేతులెత్తేయడం, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖ ’దివాలా‘ తీసిందన్న విమర్శలకు తావిస్తోంది. ఒకవైపు విగ్రహాల నిర్మాణానికి కోట్లు కుమ్మరిస్తూ.. మరోవైపు ఊరి కోసం పనిచేసే ప్రతినిధులకు వేతనాలు ఎగ్గొట్టడంపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయస్థానం మెట్లెక్కిన ప్రజాప్రతినిధులు
గత ఎనిమిది నెలలుగా గౌరవ వేతనాలు అందక అల్లాడుతున్న వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు చివరకు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. 2024 జూన్ నెల నుండి తమకు రావలసిన వేతనాలను ప్రభుత్వం నిలిపివేసిందని, దీనివల్ల క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవ చేయలేక, తమ కుటుంబాలను పోషించుకోలేక ఇబ్బందులు పడుతున్నామని పిటిషన్‌లో పేర్కొన్నారు. బాధితుల తరపున ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. ప్రజాప్రతినిధులకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.
ఖజానా ఖాళీ.. అధికారుల సంచలన అంగీకారం
గత విచారణలో హైకోర్టు వేసిన ప్రశ్నకు అధికారుల నుంచి దిగ్భ్రాంతికరమైన సమాధానం వచ్చింది. వేతనాలు ఎందుకు చెల్లించలేదో వివరించాలని కోర్టు ఆదేశించగా.. పంచాయతీ రాజ్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ ఈరోజు అనగా సోమవారం ఒక మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం శాఖ వద్ద తగినంత బడ్జెట్ లేని కారణంగానే వేతనాలు చెల్లించలేకపోయామని అందులో స్పష్టం చేశారు. మా దగ్గర నిధులు లేవు.. దయచేసి మాకు కొంత సమయం ఇవ్వండి.. నిధులు సమకూరగానే బకాయిలు తీరుస్తాం అని అధికారులు కోర్టుకు విన్నవించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.
విగ్రహాలకు కోట్లు.. జీతాలకు మొండిచేయా?
కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడిన న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులకే జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం, ఏకంగా రూ 1,750 కోట్లతో విగ్రహాలు నిర్మిస్తామని చెప్పడం అత్యంత హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. ప్రజలకు అవసరమైన సేవలు అందించే ప్రతినిధుల కడుపు మాడుస్తూ.. ఆడంబరాలకు కోట్లు ఖర్చు చేయడంపై ఆయన మండిపడ్డారు. తమ వేతనాలు వెంటనే చెల్లించకపోతే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ప్రజా పోరాటం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు.
కోర్టు సీరియస్..
అధికారులు సమర్పించిన మెమోపై అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు ధర్మాసనం.. కేవలం మెమో ఇస్తే సరిపోదని స్పష్టం చేసింది. బడ్జెట్ ఎందుకు లేదు? బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారు? అనే అంశాలపై పూర్తి సమాచారంతో కూడిన ప్రమాణ పత్రాన్ని (Affidavit) దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. అధికారుల బాధ్యతారాహిత్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

