
కమలం కండువాతో జన సేనాని పవన్ కళ్యాణ్
నాందేడ్ వేదికగా పవన్ కళ్యాణ్ రాజకీయ సెన్సేషన్ క్రియేట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. సిక్కు గురువు శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ ఆత్మార్పణ దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు నాందేడ్ చేరుకున్న ఆయనకు మహారాష్ట్ర ప్రభుత్వం ఘనస్వాగతం పలికింది. అయితే, ఈ పర్యటనలో అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రధానాంశం ఏంటంటే.. పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ (BJP) కండువా కప్పుకొని బహిరంగంగా కనిపించడం. ఏపీలో జనసేన అనే ఒక రాజకీయ పార్టీకి అద్యక్షుడి స్థానంలో ఉండి, ఏపీలో ఎన్డీయే కూటమిలో కీలకంగా ఉన్న సేనాని, పొరుగు రాష్ట్రంలో నేరుగా ’కమలం‘ కండువాతో కనిపించడం వెనుక జాతీయ స్థాయిలో ఏదైనా భారీ రాజకీయ వ్యూహం దాగి ఉందా? లేక ఎన్డీయే బంధం మరో స్థాయికి చేరిందని చెప్పకనే చెబుతున్నారా? అన్న చర్చ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలోను, దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.
విమానాశ్రయం నుంచే మొదలైన రాజకీయం
మహారాష్ట్ర ప్రభుత్వ అధికారిక అతిథిగా నాందేడ్ విమానాశ్రయంలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్‌కు లభించిన స్వాగతం అపూర్వం. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాజ్యసభ సభ్యులు అశోక్ చవాన్ స్వయంగా ఎదురేగి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అయితే, ఈ పర్యటనలో అసలైన ’ట్విస్ట్‘ పవన్ కట్టుకున్న బీజేపీ కండువా.. ఏపీలో ఎన్డీయే (NDA) కూటమిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన సేనాని, పొరుగు రాష్ట్రంలో నేరుగా బీజేపీ చిహ్నంతో దర్శనమివ్వడం వెనుక లోతైన అర్థముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇది కేవలం ఒక కండువా కాదు, కూటమిలోని బంధం రాష్ట్ర సరిహద్దులు దాటి జాతీయ స్థాయికి చేరిందనే బలమైన సంకేతంగా అభివర్ణిస్తున్నారు.
ఆత్మీయ స్వాగతం..రాజకీయ భేటీల వెనుక అసలు కథ
విమానాశ్రయం నుంచి బస వరకు పవన్ కళ్యాణ్ పర్యటన అంతా ఒక భారీ పొలిటికల్ ర్యాలీని తలపించింది. మహారాష్ట్ర బీజేపీ నేతలు ఆయన కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నాందేడ్ జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి అజిత్ సావే, ఎంపీ అజిత్ గోప్ చడే నేరుగా వచ్చి కలవగా, ఆర్‌ఎస్‌ఎస్ (RSS) ప్రముఖులు రాజేంద్ర కోడగే పవన్‌తో ప్రత్యేకంగా భేటీ కావడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం రాజకీయాలే కాకుండా, సిద్ధాంతపరంగా కూడా బీజేపీ జాతీయ నాయకత్వంతో పవన్ కళ్యాణ్ ఎంతటి ఆత్మీయ సంబంధాన్ని కలిగి ఉన్నారో ఈ సమావేశాలు స్పష్టం చేస్తున్నాయి.
సందేశం ఏమిటి? భవిష్యత్తుపై కొత్త ఆశలు
పవన్ కళ్యాణ్ పర్యటన కేవలం సిక్కు గురువుల ఆత్మార్పిణ వేడుకలకు మాత్రమే పరిమితం కాలేదు. నాందేడ్ గడ్డపై ఆయన ప్రదర్శించిన ఈ రాజకీయ సాన్నిహిత్యం భవిష్యత్తులో జాతీయ రాజకీయాల్లో ఆయన పోషించబోయే పాత్రకు ఒక ట్రైలర్‌లా కనిపిస్తోంది. సనాతన ధర్మ పరిరక్షణ.. జాతీయ సమగ్రత అనే అంశాలపై పవన్ తన గళాన్ని వినిపిస్తున్న తరుణంలో, బీజేపీ కండువా ధరించడం ద్వారా తాను ఎన్డీయేలో ఒక కీలకమైన ’నేషనల్ ప్లేయర్‘ గా మారబోతున్నానని సేనాని స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ఈ నాందేడ్ పర్యటనతో అటు మహారాష్ట్ర, ఇటు ఏపీ, తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ మరోసారి ’టాక్ ఆఫ్ ది టౌన్‘గా నిలిచారు.
పెరిగిన సాన్నిహిత్యం
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ వంటి ఉద్దండులు పవన్ కళ్యాణ్‌కు స్వాగతం పలకడం, ఆయన బీజేపీ కండువా ధరించడం వెనుక జాతీయ నాయకత్వం యొక్క పూర్తి మద్దతు కనిపిస్తోంది. గతంలో ప్రధాని మోదీ పవన్‌ను ’తుఫాన్‘ అని అభివర్ణించగా, ఇప్పుడు నాందేడ్ వేదికగా పవన్ ప్రదర్శించిన ఈ సాన్నిహిత్యం, రాబోయే రోజుల్లో ఆయన బీజేపీలో కీలక బాధ్యతలు లేదా జాతీయ స్థాయిలో స్టార్ క్యాంపెయినర్ పాత్ర పోషించబోతున్నారనే సంకేతాలను ఇస్తోందనే చర్చ కూడా రెండు తెలుగ రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.

