సొంతూరులా ’కొణిదెల‘పై పవన్ కల్యాణ్ మమకారం
x

సొంతూరులా ’కొణిదెల‘పై పవన్ కల్యాణ్ మమకారం

ఆంధ్రప్రదేశ్ లోనే ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దేందుకు ముమ్మర ప్రయత్నాలు.


ఇంటి పేరులోని బంధం.. ఇచ్చిన మాటపై ఉన్న మక్కువ కలిసి నంద్యాల జిల్లాలోని ఒక మారుమూల గ్రామాన్ని నేడు ప్రగతి పథంలో నిలబెట్టాయి. సాక్షాత్తూ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్ తన ఇంటి పేరు కలిగిన ’కొణిదెల‘ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు. కేవలం దత్తత ప్రకటనకే పరిమితం కాకుండా, తన సొంత విరాళంతో గ్రామస్థుల దాహార్తిని తీర్చడం నుంచి, కోట్లాది రూపాయల నిధులతో బీటీ రోడ్లు, సిమెంటు వీధులు, రైతులకు గోకులాలు నిర్మించే వరకు.. ప్రతి అడుగులోనూ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా ఆ ఊరిని మారుస్తున్నారు. రాజకీయ నాయకుడిగా కంటే ఆ గ్రామ బిడ్డగా ఆయన చూపుతున్న ఈ చొరవ ఇప్పుడు రాయలసీమ వ్యాప్తంగా సరికొత్త చర్చకు దారితీసింది.


అనాడు మాట.. నేడు చేత

రాజకీయాల్లో హామీలు ఇవ్వడం సహజం. కానీ ఇచ్చిన హామీ కోసం అధికారంలో ఉన్నా లేకపోయినా కట్టుబడి ఉండటం అరుదు. 2019 ఎన్నికల ప్రచార సమయంలో కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న పవన్‌కల్యాణ్‌ను కొణిదెల గ్రామస్థులు కలిసి తమ ఊరిని దత్తత తీసుకోవాలని కోరినప్పుడు, ఆయన కేవలం చిరునవ్వుతో తల ఊపడమే కాదు. ఆ అభ్యర్థనను తన మనసులో బలంగా ముద్రించుకున్నారు. ఆ నాడు ఒక సామాన్యుడిగా ఇచ్చిన ఆ మాటను, ఈ నాడు ఉప ముఖ్యమంత్రి హోదాలో అద్భుతమైన వాస్తవ రూపంలోకి తెచ్చారు.


సొంత నిధులతో తీరిన గ్రామ దాహార్తి

గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం ఇచ్చే నిధుల కంటే ముందే, తన సొంత సంపాదన నుంచి రూ. 50 లక్షల విరాళాన్ని ప్రకటించి పవన్ తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఒక నాయకుడు తన వ్యక్తిగత నిధులను గ్రామానికి వెచ్చించడం ఆ గ్రామస్థులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. జిల్లా యంత్రాంగం సూచన మేరకు ఈ నిధులతో 90 వేల లీటర్ల భారీ సామర్థ్యం గల ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును నిర్మించారు. దశాబ్దాలుగా మంచినీటి కోసం మైళ్ల దూరం నడిచిన ఆ పల్లె తల్లుల కళ్లలో ఆనందం, ఇంటి ముందే గంగమ్మ దర్శనమిస్తుంటే కనిపిస్తున్న తృప్తి.. పవన్ చేసిన ’దత్తత‘ ప్రక్రియకు అసలైన అర్థాన్ని ఇచ్చింది.


అంతర్గత రహదారుల పండుగ

ఒకప్పుడు వర్షం పడితే అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నుంచి, నేడు కొణిదెల గ్రామం మెరిసిపోయే సిమెంటు రహదారులతో కళకళలాడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ పథకాన్ని ఈ గ్రామానికి పక్కాగా వర్తింపజేస్తున్నారు. పల్లె పండుగ 1.0లో భాగంగా రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన మూడు ప్రధాన అంతర్గత సిమెంటు రోడ్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా, ప్రస్తుతం పల్లె పండుగ 2.0 కింద మరో రూ. 45 లక్షల అంచనాతో 7 సీసీ రోడ్ల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయితే గ్రామమంతా అద్దంలాంటి రహదారులతో సరికొత్త రూపును సంతరించుకోనుంది.


కనెక్టివిటీ విప్లవం.. రూ. 4.45 కోట్లతో బాహ్య ప్రపంచానికి వారధి

గ్రామస్తుల చిరకాల స్వప్నమైన మెరుగైన రవాణా సౌకర్యాలను సాకారం చేసేందుకు భారీ నిధుల వెల్లువ కురుస్తోంది. ఊరి నుంచి బయటి ప్రాంతాలకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను గమనించిన పవన్‌కల్యాణ్, కనెక్టివిటీ పనుల కోసం ఏకంగా రూ. 4.45 కోట్లను మంజూరు చేయించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ స్కూల్ నుంచి పగిడ్యాల మండలం లక్ష్మాపురం వరకు 5 కిలోమీటర్ల మేర నిర్మించనున్న బీటీ రోడ్డు కోసం రూ. 4 కోట్లు కేటాయించారు. అలాగే, ఆర్‌అండ్‌బీ ప్రధాన రహదారి నుంచి గ్రామం వరకు ఉన్న లింక్ రోడ్డు పునరుద్ధరణకు మరో రూ. 45 లక్షలు వెచ్చిస్తున్నారు. ఈ పనులతో కొణిదెల గ్రామం చుట్టుపక్కల ప్రాంతాలతో వేగవంతమైన అనుసంధానాన్ని పొందనుంది.

అన్నదాతకు అండగా.. సాగు, నివాస రంగాల్లో నవశకం

కేవలం రోడ్లకే పరిమితం కాకుండా, గ్రామంలోని ప్రతి రైతుకు, ప్రతి పేదవాడికి లబ్ధి చేకూరేలా సమగ్ర ప్రణాళికలు అమలు జరుగుతున్నాయి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని సాగు పనులకు అనుసంధానిస్తూ రైతుల కోసం 49 ఫీడర్ ఛానళ్లను అభివృద్ధి చేశారు. పాడి రైతుల సంక్షేమం కోసం 4 అత్యాధునిక గోకులాలు నిర్మించడంతో పాటు, నీటి వనరుల సంరక్షణలో భాగంగా రెండు కాలువలను పునరుద్ధరించి, 3 కమ్యూనిటీ చెక్ డ్యామ్‌లను బాగు చేశారు. ఇక సొంతింటి కల కలిగిన 19 పేద కుటుంబాలకు గృహ నిర్మాణ శాఖ ద్వారా పక్కా ఇళ్లను మంజూరు చేయించి, కొణిదెల గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతున్నారు.

Read More
Next Story