
మూడు రోజులు పిఠాపురంలోనే పవన్ కల్యాణ్
ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని అధికారులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో మూడు రోజుల పర్యటించనున్నారు. గురువారం రాత్రి నుంచి మూడు రోజుల పాటు పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఆర్.ఆర్.బి.హెచ్.ఆర్. కళాశాల మైదానంలో 'పీఠికాపుర సంక్రాంతి మహోత్సవం' ప్రారంభిస్తారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. సాయంత్రం ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, మోహన్ నగర్ ప్రాంతాలను సందర్శిస్తారు. శనివారం ఉదయం గొల్లప్రోలులో ఇళ్ళ స్థలాలను పరిశీలిస్తారు. ఉదయం 10.30 గంటలకు కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో శాంతిభద్రతలపై సమీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు రంగరాయ మెడికల్ కళాశాలలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేస్తారు. పిఠాపురం వేదికగా నిర్వహించనున్న సంక్రాంతి మహోత్సవాల్లో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేశారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలు, థింసా, కూచిపూడి వంటి ప్రదర్శనలతో పాటు కేరళ మార్షల్ ఆర్ట్స్, జానపద గీతాలు, సినీ మ్యూజికల్ నైట్ కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
మరో వైపు బుధవారం ఆయన అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో 2047 నాటికి 50 శాతం గ్రీన్ కవర్ సాధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ శాఖలు అటవీ శాఖతో సమన్వయంతో ముందుకు సాగాలని ఆదేశించారు. పండ్ల తోటల్లో విభిన్న జాతుల మొక్కలను సాగు చేయడం ద్వారా భూసారాన్ని పెంచడంతోపాటు జీవవైవిధ్యాన్ని రక్షించవచ్చని సూచించారు. రైతులు అంతర పంటల సాగును ప్రోత్సహించాలని, సింథటిక్ మందుల వినియోగం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బుడితి రాజశేఖర్, విజయ్ కుమార్, పి.వి. చలపతిరావు వంటి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

