2 కోట్లిచ్చి సభ్యత్వం తీసుకున్న పవన్ కల్యాణ్
x
సభ్యత్వాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్

2 కోట్లిచ్చి సభ్యత్వం తీసుకున్న పవన్ కల్యాణ్

తొలి సభ్యుడిగా తన పేరును నమోదు చేయించుకున్న పవన్ కల్యాణ్.


పార్టీ బలోపేతం కోసం చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రక్రియలో ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సరికొత్త ఒరవడిని సృష్టించారు. సాధారణంగా పార్టీ అధినేతలు కేవలం కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కానీ, పవన్ తన సొంత నిధి నుంచి రూ. 2 కోట్ల విరాళాన్ని పార్టీకి అందజేసి, మొదటి సభ్యత్వాన్ని తీసుకోవడం ద్వారా తన నిబద్ధతను చాటుకున్నారు. గతంలో అత్యధిక సభ్యత్వాలు చేయించిన కార్యకర్తల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి, క్షేత్రస్థాయి నాయకులకు ఆయన తగిన గౌరవం కల్పించారు.


రెండు కోట్ల చెక్కును నాదెండ్ల మనోహర్ కి అందజేస్తూ పవన్ కల్యాణ్

పార్టీలో సరికొత్త హోదాలు.. ఉద్యమి, సాధక్, ప్రదాత

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పార్టీ సభ్యులను మూడు విభాగాలుగా వర్గీకరించారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి సభ్యత్వం తీసుకునేవారిని ఉద్యమిగా, కొత్తవారిని పార్టీలోకి చేర్చి నవతరంలో స్ఫూర్తి నింపేవారిని సాధక్ గా పిలుస్తామని ప్రకటించారు. ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా.. పార్టీకి ఆర్థిక, సాంకేతిక, మేధోపరమైన సాయం అందించేవారిని ప్రదాత లుగా పేర్కొన్నారు. ఈ వినూత్న పిలుపులు పార్టీలో క్రమశిక్షణతో కూడిన బాధ్యతను పెంచుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

జనసేన పార్టీ సభ్యత్వ నమోదులో కనిపిస్తున్న గణాంకాలు ఆ పార్టీ ప్రస్థానాన్ని కళ్లకు కడుతున్నాయి. కేవలం 150 మందితో అత్యంత సామాన్యంగా ప్రారంభమైన ఈ ప్రయాణం, నేడు 13 లక్షల మార్కును చేరుకోవడం ఒక అసాధారణ పరిణామం. 2021లో మొదటిసారి సభ్యత్వ నమోదు చేపట్టినప్పుడు 90 వేల మంది సభ్యులు ఉండగా, ఎన్నికల నాటికి ఆ సంఖ్య 6 లక్షలకు చేరుకుంది. ఇక ఎన్నికల తర్వాతి కాలంలో ఆ వేగం మరింత పుంజుకుని, ప్రస్తుతం 12.98 లక్షల సభ్యత్వాలతో పార్టీ ఒక మహా వృక్షంలా విస్తరించింది. రోజువారీ కూలీ పనులు చేసుకునే సామాన్యుల నుంచి ఉన్నత విద్యావంతుల వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రస్థానంలో భాగస్వాములు కావడం జనసేన సాధించిన అసలైన విజయంగా నిలుస్తోంది.

ఆశయమే అసలైన బలం
కేవలం సంఖ్యను పెంచుకోవడం కంటే, పార్టీ ఆశయాలను అర్థం చేసుకునే వారే తమకు ముఖ్యం అని పవన్ స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించి పని చేసేవారే అసలైన బలమని ఆయన పేర్కొన్నారు. నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్, రామ్ తాళ్లూరి వంటి ముఖ్య నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొని సభ్యత్వ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
Read More
Next Story