
జనసేన కార్యకర్త కుటుంబానికి పవన్ కళ్యాణ్ భరోసా
వసంత రాయలు కుమార్తె జాహ్నవికి అవసరమైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో బుధవారం ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటించారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన పార్టీ క్రియాశీలక సభ్యుడు చందు వీరవెంకట వసంత రాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. కృత్తివెన్ను మండల పరిధిలోని పెదచందాల గ్రామంలో ఉన్న వసంత రాయలు నివాసానికి వెళ్లిన పవన్ కళ్యాణ్, ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ప్రమాదం జరిగిన తర్వాత బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న వసంత రాయలు అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా అభినందించారు. వసంత రాయలు భార్య నాగ పుష్పావతి, కుమారుడు సీతారామరాజు, కుమార్తె జాహ్నవిని ఓదార్చిన ఆయన, పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పార్టీ తరఫున క్రియాశీలక సభ్యులకు అందజేసే రూ. 5 లక్షల బీమా చెక్కును ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అందజేశారు.
వసంత రాయలు కుమార్తె జాహ్నవికి వినికిడి లోపంతో పాటు మాటలు రావని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ చలించిపోయారు. చిన్నారికి టీటీడీ శ్రవణం ప్రాజెక్టు ద్వారా అవసరమైన వైద్య సాయం అందించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో స్థానిక శాసనసభ్యుడు కాగిత కృష్ణప్రసాద్, ప్రభుత్వ విప్ బొమ్మడి నాయకర్, అవనిగడ్డ శాసనసభ్యుడు మండలి బుద్ధప్రసాద్, కృష్ణా జిల్లా కలెక్టర్ డి.కె. బాలాజీ పాల్గొన్నారు.

