అంజనమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ జిరాఫీ దత్తత
x
విశాఖ జూలో దత్తత తీసుకున్న రెండు జిరాఫీలతో డిప్చూటీ సీఎం పవన్ కల్యాణ్

అంజనమ్మ పుట్టినరోజున పవన్ కళ్యాణ్ జిరాఫీ దత్తత

వన్యప్రాణి సంరక్షణలో డిప్యూటీ సీఎం సరికొత్త అడుగు.


ప్రకృతి ప్రేమికుడిగా, జంతు ప్రేమికుడిగా తనకున్న ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తన తల్లి అంజనాదేవి పుట్టినరోజును పురస్కరించుకుని విశాఖ ఇందిరాగాంధీ జూ పార్కులోని రెండు జిరాఫీలను ఆయన దత్తత తీసుకున్నారు. ఏడాది పాటు వాటి పోషణ ఖర్చులను తనే భరిస్తానని ప్రకటించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

వన్యప్రాణుల రక్షణ మనందరి బాధ్యత
వన్యప్రాణుల రక్షణ అనేది కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. అది మనందరి నైతిక కర్తవ్యం అంటూ పవన్ కళ్యాణ్ గళమెత్తారు. గురువారం విశాఖ జూ పార్కును సందర్శించిన ఆయన, ఈ సందర్భంగా కార్పొరేట్ సంస్థలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. లాభాపేక్ష పక్కన పెట్టి, జంతువుల సంరక్షణ బాధ్యతను స్వీకరించాలని, ప్రాణికోటి మనుగడలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అంతరించిపోతున్న జీవజాతులను కాపాడుకుంటేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమవుతుందని ఆయన కుండబద్దలు కొట్టారు. ఈ సందర్భంగా తన వ్యక్తిగత జీవితంలోని జంతు ప్రేమికుడిని కూడా బయటపెట్టారు. మా కుటుంబం మొత్తం మూగజీవాలను అమితంగా ప్రేమిస్తుంది.. ఇప్పటికే మా ఇంట్లో నాలుగు కుక్కలను పెంచుకుంటున్నాం అంటూ తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. పర్యావరణంపై పవన్ చూపిస్తున్న ఈ చిత్తశుద్ధి కేవలం మాటలకే పరిమితం కాకుండా, స్వయంగా క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా అందరినీ ఆలోచింపజేసేలా సాగింది.
జూ పార్క్ లో కలియదిరుగుతూ..

650 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న జూ పార్కును సందర్శించిన పవన్ కళ్యాణ్, అధికారులతో కలిసి ప్రతి ఎన్‌క్లోజర్‌ను నిశితంగా పరిశీలించారు. బటర్‌ఫ్లై పార్కులో వివిధ రకాల సీతాకోకచిలుకలను వదిలారు. టైగర్ రకం సీతాకోకచిలుకలు ఆయన దుస్తులపై వాలగా, వాటిని ఎంతో సున్నితంగా మొక్కలపైకి పంపారు. ఎలుగుబంట్ల కోసం ఏర్పాటు చేసిన నూతన ఎన్‌క్లోజర్‌ను ప్రారంభించి, వాటికి స్వయంగా ఆహారం అందించారు. ఏనుగుల వద్దకు వెళ్లే ముందు నిబంధనల ప్రకారం శానిటైజ్ చేసుకుని, వాటికి ఆహారం తినిపించారు. జిరాఫీలకు ఇష్టమైన రావి ఆకులు, అరటి పండ్లను తినిపించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

కంబాలకొండలో కెనోపీ వాక్

జూ సందర్శన అనంతరం కంబాలకొండ ఎకో పార్కులో 50 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేసిన నగరవనాన్ని ప్రారంభించారు. 400 మీటర్ల పొడవున్న వుడెన్ బ్రిడ్జిపై కెనోపీ వాక్ చేస్తూ ప్రకృతి అందాలను తిలకించారు. వేప, ఇప్ప, మహాగని వంటి వృక్షాల శాస్త్రీయ నామాలు, వాటి ఉపయోగాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. శాంతివనంలో మహాగని మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ ఉన్నతాధికారులు పీసీసీఎఫ్ చలపతిరావు, శాంతిప్రియా పాండే, జూ క్యూరేటర్ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Read More
Next Story