
రైల్వే ప్రాజెక్టులపై ఢిల్లీలో పవన్..అమరావతిలో చంద్రబాబు
పిఠాపురం రైల్వే స్టేషన్‌ను అన్ని హంగులతో కూడిన మోడల్ స్టేషన్‌గా తీర్చిదిద్దాలని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు పవన్ కల్యాణ్ విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అత్యంత కీలకమైన రైల్వే ప్రాజెక్టుల సాధనలో కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ వేగాన్ని ప్రదర్శిస్తోంది. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, అటు రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకే సమయంలో రైల్వే అజెండాతో రంగంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఒకవైపు పవన్ కల్యాణ్ ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి పిఠాపురం మోడల్ స్టేషన్, పీఎం గతిశక్తి వంటి కీలక ప్రతిపాదనలను కేంద్రం ముందు ఉంచగా.. మరోవైపు చంద్రబాబు అమరావతిలో రైల్వే జీఎంలు, ఉన్నతాధికారులతో భేటీ అయి హైస్పీడ్ రైల్వే కారిడార్లు, పోర్టు కనెక్టివిటీపై పక్కా రోడ్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును హైస్పీడ్ పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని అమరావతిని కేంద్ర బిందువుగా చేసుకుని హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, హైదరాబాద్-బెంగళూరు వంటి ప్రధాన నగరాలను అనుసంధానించేలా హైస్పీడ్ రైల్వే కారిడార్ల ఏర్పాటుపై ఆయన అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే దక్షిణ భారతదేశంలోని అగ్ర నగరాల మధ్య ప్రయాణ సమయం గంటల్లోకి తగ్గిపోనుంది. కేవలం ప్రయాణికులకే కాకుండా, అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా ఈ హైస్పీడ్ లైన్లను అనుసంధానించడం ద్వారా రాష్ట్రాన్ని ఒక గ్లోబల్ లాజిస్టిక్స్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా సీఎం దిశానిర్దేశం చేశారు.
పోర్టుల నుంచి పట్టాల వరకు..
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో కీలకమైన పోర్టులను రైల్వే లైన్లతో అనుసంధానించడంపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు. విశాఖపట్నం, కాకినాడ, రామాయపట్నం వంటి ఓడరేవుల నుంచి తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాలకు సరుకు రవాణాను సులభతరం చేసేలా రైల్ కనెక్టివిటీని మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. రాయలసీమ-కోస్తా మధ్య దూరాన్ని తగ్గిస్తూ కొత్త లైన్ల ఏర్పాటుపై చర్చించారు. ముఖ్యంగా విశాఖ, విజయవాడ, గుంతకల్ వంటి ప్రధాన జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు బైపాస్ లైన్లు, గిరిజన ప్రాంతాలకు రైల్వే సౌకర్యాలు కల్పించడం ద్వారా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధి ఫలాలను చేరవేయాలని చంద్రబాబు భావిస్తున్నారు.
దశాబ్దాల నిరీక్షణకు తెర
రైల్వే సమీక్షలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కొవ్వూరు-భద్రాచలం రైల్వే లైన్ ప్రతిపాదన మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ మార్గం పూర్తయితే హైదరాబాద్-విశాఖపట్నం మధ్య దూరం దాదాపు 100 కిలోమీటర్ల మేర తగ్గనుంది. అటవీ ప్రాంతాలు, వాగుల గుండా సాగే ఈ లైన్ నిర్మాణానికి అవసరమైన నిధులు, భూసేకరణపై సీఎం అధికారులతో చర్చించారు. విజయవాడ బైపాస్ ప్రాజెక్టును కూడా వేగవంతం చేయాలని ఆదేశిస్తూ, రాష్ట్రంలో కొత్తగా వస్తున్న రైల్వే ప్రాజెక్టుల కోసం భూ కేటాయింపులు, నిధుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు.

