
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఆధ్వర్యంలో ‘సర్’ పై ప్యానెల్
ఏర్పాటు చేసిన న్యాయవాదుల సంఘం, వ్యూహాత్మక సలహదారులుగా కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్
ఎన్నికల సంఘం ప్రస్తుతం చేస్తున్న ‘సర్’ ప్రక్రియపై ఒక న్యాయవాదుల సంఘం సుప్రీంకోర్టు, హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తులతో ఒక ప్యానెల్ ను ఏర్పాటు చేసింది. ఓటర్ల జాబితాలో అనుసరిస్తున్న ప్రక్రియ, దాని రాజ్యాంగబద్దత, వాటి ప్రభావాన్ని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ప్యానెల్ పరిశీలిస్తుందని రాజ్యాంగ న్యాయవాదుల సంఘం(ఎల్ఏఎఫ్సీ) ఒక ప్రకటనలో పేర్కొంది.
‘‘ఎన్నికల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై మాజీ న్యాయమూర్తులతో కూడిన కొత్తగా ఏర్పడిన స్వతంత్య్ర కమిటీ, సర్ రాజ్యాంగ బద్దత, శాసన బద్దత, ఓటర్లపై అది చూపిస్తున్న ప్రభావాన్ని అంచనా వేస్తుంది. ఇది పూర్తి స్వయం ప్రతిపత్తితో పనిచేస్తుంది’’ అని ఎల్ఏఎఫ్పీ పేర్కొంది.
ఈ కమిటీలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు ఏకే పట్నాయక్, జమ్మూకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దుర్రేజ్ అహ్మద్, మాజీ న్యాయమూర్తులు రేఖా శర్మ, అంజన ప్రకాశ్ ఉన్నారు. వీరు ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న సర్ లో కీలక అంశాలను పరిశీలిస్తారు. అర్హులైన ఓటర్ల జాబితాలో కొనసాగించారా? అనర్హులైన వారి పేర్లను సముచితంగా తొలగించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తుంది.
తన విచారణలో భాగంగా ప్రభావిత పౌరులు, పౌర సమాజం సంస్థలు, నిఫుణుల అభిప్రాయాలు, వాంగ్మూలాలు నమోదు చేయాలని, దేశవ్యాప్తంగా బహిరంగ విచారణలు నిర్వహించాలని కమిటీ యోచిస్తోంది. తమ పరిశోధనలు, సిఫార్సులకు తుది బాధ్యత కమిటీదే అని ఎల్ఎఫ్సీ పేర్కొంద. కపిల్ సిబల్, ప్రశాంత్ భూషణ్, చందర్ ఉదయ్ సింగ్, ప్రశాంత్ చంద్ర సేన్, రాజు రామచంద్రన్, రెబెక్కా మామెన్ జాన్, వారిషా ఫరాసత్ సహ పలువురు సీనియర్ న్యాయవాదులు వారికి న్యాయ సలహ అందిస్తారని పేర్కొంది.
Next Story
