‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి’
x

‘ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి’

లోక్‌సభ, రాజ్యసభలో నోటీసులు సమర్పించిన పార్లమెంటు సభ్యులు


Click the Play button to hear this message in audio format

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌పై పార్లమెంటు ఉభయ సభల్లో ఆందోళనలు వెల్లువెత్తాయి. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ఉభయ సభల్లో నోటీసులు సమర్పించారు. ఆ నోటీసుల్లో 130 మంది లోక్‌సభ ఎంపీలు, 63 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు, కొంతమంది స్వతంత్ర ఎంపీలూ ఇందుకు మద్దతు తెలిపారు. జ్ఞానేష్ కుమార్ వృత్తిలో పక్షపాతం చూపుతూ సామూహిక ఓటర్ల తొలగింపులకు పాల్పడుతున్నారని నోటీసుల్లో పేర్కొన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 324(5) ప్రకారం సీఈసీని తొలగించడానికి కనీసం 100 లోక్‌సభ, 50 రాజ్యసభ సభ్యుల సంతకాలు అవసరం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో దీన్ని సమర్పించారు.

జ్ఞానేష్ కుమార్ 2024 ఫిబ్రవరిలో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కేంద్రంలోని అధికార పార్టీకి అనుకూలంగా ఉన్నారని ప్రతిపక్షాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఓటరు జాబితా సవరణ (Special Intensive Revision) ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసినా ఆయన పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులున్నాయి.

కమిటీ విచారణ..

తీర్మానం ఆమోదం తర్వాత లోక్‌సభ స్పీకర్,రాజ్యసభ చైర్మన్ సంయుక్తంగా కమిటీ ఏర్పాటు చేస్తారు. ఈ ప్యానెల్‌లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఒక ప్రముఖ న్యాయనిపుణుడు ఉంటారు. సీఈసీకి కూడా తన వాదనలు వినిపించడానికి అవకాశం ఇస్తారు. నివేదిక సమర్పించిన తరువాత అభిశంసన ప్రక్రియ చర్చకు వెళ్తుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ తొలగించాలని పార్లమెంటులో కోరడం దేశంలో ఇదే తొలిసారి.

Read More
Next Story