వెంటిలేటర్‌పై ఒకరు..డయాలసిస్‌ మీద మరొకరు
x

వెంటిలేటర్‌పై ఒకరు..డయాలసిస్‌ మీద మరొకరు

శ్రీకాకుళం డయేరియా ఘటనపై సీఎం చంద్రబాబు ఆందోళన.


శ్రీకాకుళం డయేరియా బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. రాష్ట్రంలో ప్రజారోగ్యం విషయంలో అధికారులు ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీకాకుళంలో విజృంభించిన డయేరియా, రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న కల్తీ పాల ఘటనలపై బుధవారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బాధితులకు అందుతున్న వైద్య సేవలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

విషమంగా ఇద్దరి పరిస్థితి
శ్రీకాకుళం డయేరియా ఘటనలో బాధితుల పరిస్థితిపై సీఎం ఆరా తీయగా.. అధికారులు దిగ్భ్రాంతికర విషయాలను వెల్లడించారు. పట్టణంలోని జెమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలిపారు. ఒకరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తుండగా.. మరొకరికి డయాలసిస్‌ చేస్తున్నాం అని అధికారులు వివరించారు. వీరిద్దరి ప్రాణాలు కాపాడేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మొత్తం 76 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉందని సమాచారం.
సురక్షిత తాగునీరే లక్ష్యం
డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం తాగునీరు కలుషితం కావడమేనని గుర్తించిన ప్రభుత్వం.. తక్షణ చర్యలు చేపట్టింది. ప్రభావిత ప్రాంతాల్లో పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరాను పూర్తిగా నిలిపివేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు. ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సురక్షితమైన తాగునీటిని అందిస్తున్నామని, క్షేత్రస్థాయిలో కొత్త కేసులు నమోదు కాకుండా పర్యవేక్షిస్తున్నామని తెలిపారు.
కల్తీ పాల ఘటనపై నివేదిక
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనపై కూడా సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించారు. బాధితులందరూ ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటికే సేకరించిన పాల శాంపిళ్లను ల్యాబ్‌కు పంపించామని, నివేదిక అందిన వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఫుడ్ సేఫ్టీ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.
నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ప్రజారోగ్యానికి ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత ఇస్తుంది. ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు ఉండకూడదు అని చంద్రబాబు అధికారులను హెచ్చరించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం లోపించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇకపై నిరంతరం నిఘా ఉంచాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Read More
Next Story