
కేజీన్నర బంగారం..ఒకే రాత్రి భారీ దోపిడీ
ఒకే రాత్రి అంత పెద్ద మొత్తంలో బంగారం దోపిడీకి గురవ్వడం విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.
విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో దొంగలు భారీ దోపిడీకి పాల్పడ్డారు. సామాన్యులే కాదు, హైప్రొఫైల్ నివాసాలు కూడా తమకు లక్ష్యమేనని నిరూపిస్తూ.. ఏకంగా ఒకే రాత్రి రెండు నివాసాల్లో కేజీన్నర బంగారం (1.5 KG Gold) దోచుకెళ్లారు. ఈ మెరుపు దాడి స్థానికులను, ముఖ్యంగా విద్యావేత్తలను, వైద్యులను భయాందోళనలకు గురిచేస్తోంది.
టార్గెట్ జీఎంఆర్ క్యాంపస్.. ఏం జరిగింది?
స్థానిక జీఎంఆర్ (GMR) ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలోని నివాస సముదాయాలను దొంగలు టార్గెట్ చేశారు. ఆదివారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయం చూసి రెచ్చిపోయారు. ఓ డాక్టర్ ఇంట్లో దొంగతనం కోసం భారీ స్కెచ్ వేశారు. చిన్న పిల్లల వైద్యుడు డాక్టర్ నగేశ్ ఆదివారం తన కుటుంబం వద్దకు విశాఖ వెళ్లారు. ఇదే అదనుగా భావించిన దుండగులు, అపార్ట్‌మెంట్‌లోని ఆయన ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాల్లో దాచిన 1,250 గ్రాముల బంగారం, కిలో వెండిని ఊడ్చేశారు. సోమవారం ఉదయం డాక్టర్ తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చిందరవందరగా మారి ఉండటంతో లబోదిబోమన్నారు. ప్రొఫెసర్ ఇంట్లోనూ దోపిడీ పాల్పడ్డారు. అదే ప్రాంతంలోని మరో ఇంట్లో దొంగలు హల్చల్ చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కృష్ణారెడ్డి నివాసంలో చొరబడి 20 తులాల బంగారు నగలను అపహరించారు.
క్లూస్ టీమ్ రంగ ప్రవేశం.. పక్కా స్కెచ్?
వరుస చోరీల సమాచారం అందగానే పోలీసులు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో ఘటనా స్థలికి చేరుకున్నారు. దొంగలు ఇంటి తాళాలు తొలగించిన తీరును బట్టి చూస్తుంటే, వారు గత కొన్ని రోజులుగా ఈ ఇళ్లపై నిఘా పెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యుడు, ప్రొఫెసర్ ఇంట్లో లేని సమయాన్ని పక్కాగా తెలుసుకుని మరీ ఈ దోపిడీకి పాల్పడటం సంచలనం రేపుతోంది.
హై అలర్ట్.. రాజాం జనం బెంబేలు
ఒకే రాత్రి అంత పెద్ద మొత్తంలో బంగారం దోపిడీకి గురవ్వడం విజయనగరం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. పోలీసులు సీసీటీవీ (CCTV) ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏమైనా ఈ పని చేసిందా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇళ్లలో లేని సమయంలో విలువైన నగలను జాగ్రత్త చేసుకోవాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

