వామ్మో, నిమ్మ.. ఒక్కోకాయ రూ.15!
x

వామ్మో, నిమ్మ.. ఒక్కోకాయ రూ.15!

ఎండలతో పాటే ఎగబాకిన నిమ్మకాయల ధరలు


రైతులకు ధర పెరిగినందుకు సంతోషపడాలో దళారులు బాగుపడుతున్నందుకు బాధపడాలో తెలియని దుస్థితి. ఎండలతో పాటే నిమ్మకాయల ధరలు ఎగబాకాయి. నిన్న మొన్నటి వరకు కిలో 40,50 రూపాయలకు దొరికిన నిమ్మకాయలు ఇప్పుడు కొండెక్కాయి. కిలోల లెక్కపోయి ఇప్పుడు కాయల లెక్క వచ్చినట్టుందని వినియోగదారులు లబోదిబోమంటున్నారు.

విజయవాడ, విశాఖ, హైదరాబాద్‌ వంటి నగరాల్లో ఒక్కో కాయ 10, 15 రూపాయలు, నాణ్యమైన కాయలైతే కిలో 200, 250 రూపాయల వరకు పలుకుతున్నాయి. చిన్నకాయలైతే ఒక్కొక్కటి రూ.10లకు తక్కువ కాకుండా ఉంది. వేసవి కాలంలో కాసిని నిమ్మకాయ నీళ్లు తాగుదామనుకునే సామాన్యులకు ఇప్పుడిది ఖరీదైన వ్యవహారంగా మారింది. రైతులకు ధర దక్కుతున్నందుకు ఆనందపడాలో సామాన్యుడికి భారమైనందుకు విచారించాలో అర్థం కావడం లేదని ఓ వినియోగదారులు వాపోయిన తీరు ఆలోచించదగ్గదే. ఇందుకు ప్రధానంగా నాలుగు కారణాలు ఉన్నాయి.
సాధారణంగా రైతులు పెద్దగా లాభాలు ఆశించరు. వేసిన పంటకు పెట్టిన పెట్టుబడి పోను.. కొంత మొత్తం మిగిలినా చాలు అనుకుంటారు. లేదంటే వేసిన పంట వల్ల అప్పుల పాలు కాకపోతే అదే పదివేలని భావిస్తారు. సాధారణంగా ప్రకృతి వైపరీత్యాలు, ప్రభుత్వాల నిర్ణయాల వల్ల అన్నదాతలకు నష్టాలు వచ్చే సందర్భాలే ఎక్కువ. ఎప్పుడో ఒకసారి వారికి కాలం కలిసి వచ్చి లాభాలు చవిచూస్తారు. ఈ ఏడాది నిమ్మరైతులకు కాలం కలిసివచ్చింది. కేజీ రూ. 120 కాగా, బస్తా ఏకంగా రూ. 10 వేలు పలుకుతోంది.
గతంతో పోలిస్తే ఈసారి నిమ్మ ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వేసవి కావడంతో మార్కెట్‌లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఉంది. హైదరాబాద్ వంటి నగరాల్లో ఒక్క నిమ్మకాయ ధర రూ. 15 పలుకుతోందంటే అతిశయోక్తి కాదు.

మండుతున్న ఎండలు- పెరిగిన గిరాకీ

ఏప్రిల్ నెల కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత విపరీతంగా పెరిగింది. ఎండల నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు నిమ్మరసం, సోడా వంటి పానీయాలను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. హోటళ్లు, జ్యూస్ సెంటర్లు, ఇళ్లలో వినియోగం ఒక్కసారిగా పెరగడం వల్ల మార్కెట్‌లో నిమ్మకాయలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
ఉత్తరాది రాష్ట్రాల నుండి విపరీతమైన పోటీ
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు (పొదలకూరు), ఏలూరు, తెనాలి మార్కెట్లు నిమ్మకాయలకు ప్రధాన కేంద్రాలు. ప్రస్తుతం ఢిల్లీ, ఈశాన్య రాష్ట్రాల నుండి ఈ మార్కెట్లకు భారీగా ఆర్డర్లు వస్తున్నాయి. అక్కడ కూడా ఎండలు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు ఇక్కడి నుండి భారీ ఎత్తున లారీలను తరలిస్తున్నారు. స్థానిక అవసరాల కంటే ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు పెరగడం వల్ల ఇక్కడ ధరలు ఆకాశాన్నంటాయి.
దిగుబడి తగ్గడమూ కారణమే...
కొంతకాలంగా వాతావరణంలో వచ్చిన మార్పులు నిమ్మ తోటలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా పూత సమయంలో కురిసిన అకాల వర్షాలు లేదా అసాధారణ ఉష్ణోగ్రతల వల్ల దిగుబడి గణనీయంగా తగ్గింది. మార్కెట్‌కు రావాల్సిన నిమ్మకాయల నిల్వలు గత ఏడాదితో పోలిస్తే సగానికి పైగా తగ్గిపోయాయని తెనాలికి చెందిన నిమ్మకాయల వ్యాపారి రఘురామయ్య చెబుతున్నారు. దీంతో రైతులకు ఎంతో కొంత మేలు జరిగినా వినియోగదారులకు భారం పడకతప్పదన్నారు. డిమాండ్ సప్లే సూత్రమేనని చమత్కరించారు.
రవాణా ఖర్చులు
పెరిగిన ఇంధన ధరల ప్రభావం కూడా నిమ్మకాయలపై పడింది. పొలాల నుండి మార్కెట్‌కు, మార్కెట్ నుండి నగరాలలోని రిటైల్ షాపులకు చేరేసరికి రవాణా ఛార్జీలు తోడై, తుది వినియోగదారుడికి చేరేసరికి ధర రెట్టింపు అవుతోంది.
ఇక, వినియోగదారుల పరిస్థితి ఎలా ఉందంటే...
ఏ ఉపద్రవం వచ్చినా మేమేనా బాధితులం అంటున్నారు వినియోగదారులు. రైతు బజారులో నిన్న మొన్నటి వరకు ఓ అరడజను కాయలు ఓ 20,30రూపాయలకో దొరికేవని, ఇప్పుడు ఒక్క కాయే 15,20 రూపాయలంటే నోరు వెళ్లబెట్టాల్సి వస్తోందన్నారు వినియోగదారుడైన వెంకటేశ్వర్లు. వేసివిలో నిమ్మకాయ నీళ్లు తాగడమే ఏకైక పరిష్కారంగా చూస్తుంటారు ప్రజలు.
సాధారణంగా వేసవిలో శరీరానికి ఎలక్ట్రోలైట్స్ అందించే చౌకైన పానీయం నిమ్మరసం. కానీ ఇప్పుడు ఒక్కో కాయ 15 రూపాయలు కావడంతో మధ్యతరగతి ప్రజలు దీనిని కొనాలంటేనే భయపడుతున్నారు. నిమ్మకాయ స్థానంలో కొబ్బరి నీళ్లు లేదా ఇతర పండ్ల రసాలను ఎంచుకుందామన్నా, వాటి ధరలు కూడా ఇప్పటికే భారీగా పెరిగిపోయాయి.
ముందు ముందు ఎండలు ఇంకా పెరిగే అవకాశం ఉండటంతో, దిగుబడి మెరుగుపడితే తప్ప ధరలు వెంటనే తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Read More
Next Story