
మన అధికారుల తీరు అస్సలు బాగోలేదు సీఎం గారు: నాదెండ్ల ఫిర్యాదు
క్యాబినెట్ ఐఎఎస్ లపై అసహనం వ్యక్తం చేసిన సీఎం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగంపై అసంతృప్తి వ్యక్తమైంది. కేబినెట్ సమావేశంలోనే ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారుల పనితీరుపై నేరుగా ఫిర్యాదు చేశారు. కేబినెట్ సమావేశం ప్రారంభమైనప్పటికీ అజెండా ముందుగా అందలేదని ఆయన ప్రస్తావించారు. అజెండా ముందే ఇచ్చి ఉంటే మంత్రులు పూర్తిగా అధ్యయనం చేసి సమావేశానికి రావడానికి వీలుండేదని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. వ్యవస్థలు సులభంగా పనిచేయాల్సిందిపోయి మరింత క్లిష్టంగా మారుతున్నాయని అసహనం వ్యక్తం చేశారు. అధికారుల పనితీరులో లోపాలు ఉన్నాయని పరోక్షంగా వ్యాఖ్యానించారు.
గతంలో కార్యదర్శులు చొరవ తీసుకుని సందేహాలను నివృత్తి చేసేవారని సీఎం గుర్తుచేశారు. ప్రస్తుతం ఆ విధానం కనిపించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి అధ్యక్షతన దాదాపు మూడు గంటలకు పైగా మంత్రివర్గ సమావేశం కొనసాగింది. అజెండా అంశాలు పూర్తయ్యాక కూడా వివిధ అంశాలపై మంత్రులతో సీఎం విస్తృతంగా చర్చించారు.
ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం పనితీరుపై సీఎం చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

