
ఇటీవల నేవీలో చేరిన ఐఎన్‌ఎస్ అరిధామన్ నూక్లియర్ సబ్‌మెరైన్
అణు జలాంతర్గాముల పుట్టుక విశాఖలోనే!
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే భారత అణు జలాంతర్గాముల పుట్టుక విశాఖ కేంద్రంగానే జరుగుతోంది.
ఎస్‌బీసీలోనే పురుడు పోసుకుంటున్నాయ్!
భారత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నూక్లియర్ సబ్‌మెరైన్ల (అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ వెసల్స్) పుట్టుక విశాఖలోనే జరుగుతోంది. విశాఖ నేవల్ డాక్‌యార్డులోని షిప్ బిల్డింగ్ సెంటర్ (ఎస్‌బీసీ)లో ఇవి పురుడు పోసుకుంటున్నాయి. రెండు దశాబ్దాల క్రితం నుంచి భారత్ మొత్తం ఐదు అరిహంత్ క్లాస్ అణు జలాంతర్గాములను సమకూర్చుకుంటోంది. మొదటిది ఐఎన్‌ఎస్ అరిహంత్‌ను 2009 జులైలో ప్రారంభించగా 2016లో నేవీలో చేరింది. రెండో అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిఘాత్ 2024లో నేవీలో చేరి సేవలందిస్తోంది. ఐఎన్‌ఎస్ అరిధామన్ నిర్మాణాన్ని 2018లో మొదలు పెట్టారు. 2021 నవంబరులో ప్రారంభించారు. ఇప్పుడు మూడవదైన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామన్‌ను నేవీకి అప్పగించారు. ఇక ఈ సిరీస్‌లో నాలుగో అణు జలాంతర్గామికి ఇంకా పేరు నిర్ణయించలేదు. దానిని వచ్చే ఏడాది ప్రారంభించడానికి రక్షణ శాఖ సన్నాహాలు చేస్తోంది. మరోవైపు ఐదో అణు జలాంతర్గామి పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
సముద్ర సన్నాహాల్లో (సీ ట్రయల్స్‌లో) అరిధామన్..
పేరుకు తగ్గట్టే అరిధామన్!
అరిధామన్! సంస్కృతంలో అరి అంటే శత్రువు.. ధామన్ అంటే.. విధ్వంసకారి. ఇప్పుడు భారత నావికాదళంలోకి కొత్తగా చేరిన మూడో అణు జలాంతర్గామికి అరిధామన్ అనే పేరునే పెట్టారు. పేరుకు తగ్గట్టే ఈ అరిధామన్.. అరవీర భయంకరమైన దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉండడం వల్ల శత్రువుల గుండెల్లో గుబులు రేపుతోంది.
మూడో అణు జలాంతర్గామి అరిధామన్..
అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న వేళ తూర్పు తీరంలోని మన బంగాళాఖాతంలో ఐఎన్‌ఎస్ అరిధామన్ అణు జలాంతర్గామి (నూక్లియర్ సబ్‌మెరైన్) ఇండియన్ నేవీలో చేరింది. భారత నావికాదళంలోకెల్లా అత్యంత శక్తివంతమైన అణు జలాంతర్గామి ఐఎన్‌ఎస్ అరిధామనే. నౌకాదళంలో నూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్‌మెరైన్ల (ఎస్‌ఎస్‌బీఎన్) పరంపరలో ఇది మూడవది. ఈ నూక్లియర్ సబ్‌మెరైన్ అణు శక్తితో నడుస్తుంది. భూమి, గాలి, సముద్రం నుంచి క్షిపణి దాడులు చేసే సామర్థ్యం దీనికుంది.
ఆద్యంతం.. అత్యంత రహస్యం..
భారత్ తన రక్షణ విధానంలో భాగంగా అణు జలాంతర్గాముల తయారీ, నిర్వహణ ప్రాజెక్టును అత్యంత రహస్యంగా నిర్వహిస్తోంది. అందుకే దీనిని సీక్రెట్ వెసల్ ప్రాజెక్టుగా పేర్కొంటారు. ఈ నూక్లియర్ సబ్‌మెరైన్ల సీ ట్రయల్స్, లాంచింగ్, కమిషనింగ్ వంటి వాటిని కూడా ప్రభుత్వం/రక్షణ శాఖ రహస్యంగానే చేపడుతుంది. నేవీలో ఇతర యుద్ధనౌకల కమిషన్ ప్రక్రియను అట్టహాసంగా నిర్వహిస్తారు. కానీ అణు జలాంతర్గాములను నేవీలోకి ప్రవేశపెట్టేటప్పుడు గోప్యతను పాటిస్తారు. అందులో భాగంగానే రెండు రోజుల క్రితం (శుక్రవారం) విశాఖ వచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ఐఎన్‌ఎస్ అరిధామన్‌ను రహస్యంగానే నేవీలోకి ప్రవేశపెట్టారు. ఐఎన్‌ఎస్ తారాగిరి యుద్ధనౌకను జాతికి అంకితం చేసేందుకు వచ్చిన ఆయన ఆ పనిని ముగించుకుని సీక్రెట్‌గా ఐఎన్‌ఎస్ అరిధామన్‌ను నేవీకి అప్పగించారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కానీ రాజ్‌నాథ్‌సింగ్ ‘శబ్ధ్ నహీ.. శక్తి హై అరిధామన్.. అంటూ పోస్టు చేసే దాకా ఈ విషయం బయట ప్రపంచానికి తెలియలేదు.
ప్రపంచంలోనే అత్యంత శక్తి శాలి అరిధామన్..
ప్రపంచంలోని అత్యంత శక్తి సామర్థ్యాలు కలిగిన అణు జలాంతర్గాముల్లో ఐఎన్‌ఎస్ అరిధామన్ ఒకటి కావడం విశేషం! తొలి రెండు అణు జలాంతర్గాములు ఐఎన్‌ఎస్ అరిహంత్, అరిఘాత్‌లకంటే ఈ ఐఎన్‌ఎస్ అరిధామన్ ఎంతో శక్తివంతమైనది. ఇది శత్రువుల రాడార్లకు చిక్కని సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, అరిహంత్ తరగతికి చెందిన ఈ అణు జలాంతర్గాములు శత్రువుల కంటపడకుండా సముద్ర గర్భంలో నెలల తరబడి మునిగి ఉండడం వీటి ప్రత్యేకత. శత్రు దేశాల నుంచి అణు దాడి జరిగితే సముద్రం లోపలి నుంచే ధీటుగా బదులిచ్చే సెకండ్ స్ట్రైక్ సామర్థ్యం వీటి సొంతం. పాత జలాంతర్గాముల్లో నాలుగు లాంచ్ ట్యూబులే ఉండగా, అరిధామన్‌లో ఎనిమిది ఉంటాయి. అంటే దీని దాడి సామర్థ్యం రెట్టింపు పెరిగిందన్న మాట. ఇందులోని 8 కే–4 క్షిపణులు 3,500 కిలోమీటర్లు, కే–15 క్షిపణులు 700 కి.మీల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తాయి. అధునాతన సోనార్ వ్యవస్థలు, మెరుగైన అకౌస్టిక్ సైలెన్సింగ్ సాంకేతికత వల్ల సముద్రంలో ఇది కదులుతున్నా శత్రువుల రాడార్లకు చిక్కదు. అస్సలు శబ్దం రాదు. శత్రువు మనపై దాడికి దిగితే ఎక్కడో సముద్ర గర్భంలో (400 మీటర్ల దిగువ వరకు) దాగి ఉన్న అరిధామన్ సెకన్ల వ్యవధిలోనే ప్రతీకార దాడితో శత్రువు నామరూపాలు లేకుండా చేస్తుంది.
ఐఎన్‌ఎస్ అరిధామన్ ప్రత్యేకతలేమిటి?
ఐఎన్‌ఎస్ అరిహంత్, అరిఘాత్‌లు 6000–6500 టన్నుల బరువుంటే.. ఐఎన్‌ఎస్ అరిధామన్ 7,000 టన్నుల బరువుంటుంది. 130 మీటర్ల పొడవు, 11 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఇది భారీ క్షిపణులను మోసుకెళ్తుంది. ఇందులో అమర్చిన 83 మెగావాట్ల ప్రెజరైజ్డ్ లైట్ వాటర్ రియాక్టర్ దీనికి అపరిమితమైన శక్తినిస్తుంది. ఇది సముద్రం అడుగున 24 నాటికల్ మైళ్లు (44 కి.మీలు), పైన 15 నాటికల్ మైళ్ల (28 కి.మీల) వేగంతో ప్రయాణిస్తుంది. బంగాళాఖాతంలో సురక్షిత ప్రాంతాల్లో ఉంటూనే శత్రువుల గుండెల్లో దడ పుట్టించే వ్యూహాత్మక లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. పెట్రోల్, డీజిల్‌తో పని లేకుండా నిరంతర అణు ఇంధనంతో పని చేస్తుంది. ఐఎన్‌ఎస్ అరిధామన్ ప్రాజెక్టు విలువ రూ.30 వేల కోట్లు ఉంటుందని అంచనా.
పుట్టుక, సేవలూ విశాఖ కేంద్రంగానే..
విశాఖ నేవల్ డాక్‌యార్డులో తయారైన ఈ అరిధామన్ అణు జలాంతర్గామి తూర్పు నావికాదళం అధీనంలో సేవలదించనుంది. వైజాగ్‌కు 55 కి.మీల దూరంలో రాంబిల్లి వద్ద ఉన్న ఐఎన్‌ఎస్ వర్ష స్థావరం కేంద్రంగా పని చేస్తుంది. ఇప్పటికే నేవీలో సేవలందిస్తున్న ఐఎన్‌ఎస్ అరిహంత్, అరి«ఘాత్‌ల సరసన ఇప్పుడు ఐఎన్‌ఎస్ అరిధామన్ చేరింది. అన్ని రకాల పరీక్షలను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ అణు జలాంతర్గామి హిందూ మహా సముద్రంలో భారత పహారాను మరింత కట్టుదిట్టం చేయనుంది.
ఐదు దేశాల సరసన చేరిన భారత్..
భారత్ 75 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో అణు జలాంతర్గాములను నిర్మిస్తోంది. దీంతో ఇలాంటి వాటిని కలిగి ఉన్న అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా దేశాల సరసన ఇండియా చేరింది.
Next Story

