బాణసంచా కేంద్రాల్లో పేలుతున్నది టపాసులు కాదు, పేదల ప్రాణాలు
x

బాణసంచా కేంద్రాల్లో పేలుతున్నది టపాసులు కాదు, పేదల ప్రాణాలు

పండుగ వెలుగుల వెనుక పేలుతున్న కార్మికుల జీవితాలకు ముగింపు ఎప్పుడో?


నిప్పురవ్వ తాకితే చాలు.. నిరుపేద కుటుంబాల్లో అంతులేని చీకట్లు నిండుతున్నాయి. పండుగ వెలుగులు నింపాల్సిన బాణసంచా, ఆ తయారీ కార్మికుల జీవితాల్లో మాత్రం మృత్యుపాశంగా మారుతోంది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో శనివారం సంభవించిన భీకర విస్ఫోటనం కేవలం ఒక ప్రమాదం మాత్రమే కాదు.. అది వ్యవస్థీకృత నిర్లక్ష్యం చేసిన హత్య. 23 మంది కార్మికులు సజీవ దహనమైన ఈ ఘోర కలికం, దశాబ్దం క్రితం నాటి ’వాకతిప్ప‘ మారణకాండను కళ్లకు కడుతోంది. అంకెలు మారుతున్నాయి తప్ప, ఆవిరవుతున్న ప్రాణాల విలువ మాత్రం పాలకులకు పట్టడం లేదనడానికి ఈ దశాబ్ద కాలపు మృత్యు యాత్రే నిదర్శనం. రక్తం మాంసం ముద్దలుగా చెల్లాచెదురైన దేహాలు, గాలిలో కలిసిన ఆర్తనాదాల మధ్య.. వ్యవస్థలోని లోపాలను వేలెత్తి చూపుతున్న ప్రత్యేక కథనం ఇది.

భారీ పేలుడు - ప్రాణ నష్టం

కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం గ్రామంలోని సూర్యశ్రీ ఫైర్‌వర్క్స్‌ బాణసంచా తయారీ కేంద్రంలో 2026, ఫిబ్రవరి 28 శనివారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటలకు ఊహించని రీతిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో తయారీ కేంద్రంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉండటంతో ప్రాణనష్టం తీవ్రంగా ఉంది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 20 నుంచి 23 మంది వరకు మరణించగా, మృతుల్లో అత్యధికులు మహిళలే ఉండటం అత్యంత విషాదకరం.

ప్రమాద తీవ్రత - భీభత్సం

ఈ పేలుడు ధాటి ఎంత భయంకరంగా ఉందంటే, మృతదేహాలు ఘటనా స్థలం నుండి సుమారు 500 మీటర్ల దూరం వరకు గాలిలో ఎగిరిపడ్డాయి. పేలుడు శబ్దం దాదాపు 5 కిలోమీటర్ల మేర వినిపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పేలుడు ప్రకంపనల ధాటికి సమీపంలోని కొన్ని భవనాలకు పగుళ్లు కూడా వచ్చాయని స్థానికులు తెలిపారు. ఈ విస్ఫోటనం ఆ ప్రాంతాన్నంతటినీ యుద్ధ క్షేత్రాన్ని తలపించేలా మార్చేసింది.

క్షతగాత్రులకు వైద్య సహాయం

ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే కాకినాడలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (GGH) కి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి.

ప్రమాదానికి గల కారణాలు

ఈ దుర్ఘటనపై స్పందించిన అధికారులు ప్రాథమిక విచారణలో కీలక అంశాలను గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా, అనుమతి పొందిన దానికంటే అధిక మొత్తంలో బాణసంచా నిల్వ ఉంచడం, తయారీ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడమే ఈ భారీ పేలుడుకు ప్రధాన కారణమని భావిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

వాకతిప్ప ఘోరం - దశాబ్ద కాలం నాటి మారణకాండ
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా చరిత్రలో బాణసంచా ప్రమాదాలు ఒక నిరంతర విషాదంగా పరిణమించాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం, 2014 అక్టోబర్ 22న యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలో సంభవించిన భీకర పేలుడు యావత్ రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఆ ప్రమాదంలో 18 మంది కార్మికులు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. నేడు వేట్లపాలెంలోనూ అదే స్థాయిలో మరణాలు సంభవించడం చూస్తుంటే, పదేళ్లు గడిచినా భద్రతా వ్యవస్థలలో ఎటువంటి మార్పు రాలేదని, క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పూర్తిగా వైఫల్యం చెందిందని స్పష్టమవుతోంది.
వరుస ప్రమాదాలు - ఆరని నిప్పుకణాలు
గతేడాది రాయవరంలోని శ్రీ గణపతి ఫైర్ వర్క్స్ కేంద్రంలో జరిగిన పేలుడు ఆరుగురిని బలితీసుకోగా, కోనసీమ జిల్లా విలస గ్రామంలో ఓ కిరాణా షాపులో అక్రమంగా నిల్వ ఉంచిన బాణసంచా పేలి దంపతులు ప్రాణాలు కోల్పోయారు. ఈ వరుస సంఘటనలు తయారీ కేంద్రాల్లోని ప్రమాదకర పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. లైసెన్స్ ఉన్నా లేకపోయినా, కార్మికుల ప్రాణాలను పణంగా పెట్టి సాగిస్తున్న ఈ మృత్యు వ్యాపారం నిరుపేద కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపుతోంది.
నిబంధనలు కాగితాలకే.. నిల్వలు పరిమితికి మించి
జిల్లావ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్ తయారీ కేంద్రాలు ఉన్నప్పటికీ, రక్షణ చర్యలు మాత్రం అడుగడుగునా గాలికి వదిలేస్తున్నారు. నిబంధనల ప్రకారం.. తయారీ కోసం ’ఫారమ్ 20', విక్రయాల కోసం’'ఫారమ్ 24' లైసెన్సులు విడివిడిగా ఉండాలి. కానీ, అనేక చోట్ల తయారీ కేంద్రాలనే విక్రయ కేంద్రాలుగా మార్చేస్తున్నారు. తయారీ జరిగే చోట వినియోగదారుల తాకిడి పెరగడం, అనుమతికి మించిన నిల్వలను అక్కడే ఉంచడం ప్రమాదాల తీవ్రతను పెంచుతోంది.
లాభార్జనే ధ్యేయం - పరిమితి మించిన విస్ఫోటనం
పండుగ సీజన్లలో వచ్చే భారీ ఆర్డర్ల కోసం తక్కువ సమయంలో ఎక్కువ ఉత్పత్తి చేయాలనే ఆశతో యజమానులు రక్షణ సూత్రాలను తుంగలో తొక్కుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా టన్నుల కొద్దీ పేలుడు పదార్థాలను నిల్వ చేస్తున్నారు. పరిమిత సంఖ్యలో కార్మికులు ఉండాల్సిన చోట డజన్ల కొద్దీ మందిని ఇరుకు గదుల్లో కూర్చోబెట్టి పనులు చేయిస్తున్నారు. ఇలాంటి అత్యంత ప్రమాదకర వాతావరణంలో చిన్న నిప్పురవ్వ తగిలినా, అది క్షణాల్లో పెను విస్ఫోటనంగా మారి ప్రాణాలను బలితీసుకుంటోంది.
వృత్తి ధర్మం.. ప్రాణ సంకటం
వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, బిక్కవోలు వంటి ప్రాంతాల్లో బాణసంచా తయారీ అనేది తరతరాలుగా వస్తున్న ఒక కులవృత్తిలా మారిపోయింది. వేల సంఖ్యలో నిరుపేద కుటుంబాలు దీనిపైనే ఆధారపడి పొట్ట పోసుకుంటున్నాయి. పని ఒత్తిడి పెరిగినప్పుడు అనుభవం లేని కార్మికులను రంగంలోకి దించడం, గాలి వెలుతురు లేని ఇరుకు గదుల్లో వారిని కూర్చోబెట్టడం మృత్యువును ఆహ్వానించినట్లే అవుతోంది.
అధికారుల ’మామూలు‘ తనిఖీలు
ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు హడావుడి చేయడం, తూతూమంత్రంగా నోటీసులు ఇవ్వడం ఒక తంతుగా మారింది. శాశ్వత ప్రాతిపదికన భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం, రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమ కేంద్రాలపై ఉక్కుపాదం మోపకపోవడం వల్లే వాకతిప్ప వంటి విషాదాలు పదే పదే పునరావృతమవుతున్నాయి. యంత్రాంగం ఇప్పటికైనా తన నిద్రమత్తు వదిలి కఠిన చర్యలు తీసుకోకపోతే, ఈ కేంద్రాలు మరిన్ని నిరుపేద కుటుంబాల్లో శాశ్వతంగా చీకట్లు నింపడం ఖాయం.
చితి మంటలు ఆరిపోవచ్చు.. వ్యవస్థ కళ్లు తెరిచేనా?
వేట్లపాలెం ఘటనలో లేచిన పొగలు రేపు అణిగిపోవచ్చు.. బాధితుల ఆర్తనాదాలు కాలక్రమేణా గాలిలో కలిసిపోవచ్చు.. కానీ, తెగిపడిన ఆ పసి ప్రాణాలు, తమ వారు తిరిగి రారన్న చేదు నిజంతో కుమిలిపోయే కుటుంబాల ప్రశ్నలకు సమాధానం చెప్పేది ఎవరు? ప్రతి ప్రమాదం జరిగినప్పుడు ప్రకటించే కొన్ని లక్షల రూపాయల ’ఎక్స్‌గ్రేషియా‘లు.. ఆరిపోయిన దీపాలను తిరిగి తీసుకురాలేవు.
చనిపోయిన కార్మికులంతా అక్షరాస్యులు కాకపోవచ్చు. కానీ వారు తమ ప్రాణాలను పణంగా పెట్టి తయారుచేసిన టపాసులు దేశమంతటా పండుగ వెలుగులు నింపుతున్నాయి. మరి వారి జీవితాల్లో మాత్రం ఎందుకీ నిత్య మృత్యుఘోష? బాణసంచా తయారీ కేంద్రాలు కేవలం లాభాల గనులు మాత్రమే కాదు. అవి వేల కుటుంబాల జీవనాధారాలు. లాభాల వేటలో యజమానులు, పర్యవేక్షణ పేరుతో అధికారులు తమ బాధ్యతలను విస్మరిస్తే.. పేదల ప్రాణాలు ఇలాగే ’టపాసు‘ల కంటే చౌకగా కాలిపోతూనే ఉంటాయి.
ఇకనైనా ’వాకతిప్ప‘ జ్ఞాపకాలను తుడిచేసేలా.. ’వేట్లపాలెం‘ మారణహోమానికి చరమగీతం పాడేలా శాశ్వత పరిష్కారాలు రావాలి. లేదంటే, రాబోయే పండుగ వెలుగుల్లో కూడా ఈ అమాయక కార్మికుల కాలిపోయిన దేహాల వాసనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. చనిపోయిన వారు సంఖ్య మాత్రమే కాదు.. వారు ఒక కుటుంబానికి సర్వస్వం అన్న నిజాన్ని పాలకులు గుర్తిస్తారని ఆశిద్దాం.
Read More
Next Story