
కారులో విగతజీవులుగా యువతీయువకుడు
హత్యా? ఆత్మహత్య? కోణంలో పోలీసుల దర్యాప్తు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా నగరంలో ఘటన
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నోయిడా నగరంలో ఓ కారులో యువతీ యువకుడు మృతదేహాలు లభించడం కలకలం రేపింది. సెక్టార్–39 స్టేషన్ పోలీసులు ఈ ఘటనను అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే ఇద్దరూ హత్యకు గురై ఉంటారని కుటుంబ సభ్యులు పేర్కొంటుండడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
పిస్టల్, బుల్లెట్లు స్వాధీనం..
తుపాకీ పేలుడు శబ్దాలు వినిపించాయని స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాక్ చేసి ఉన్న కారులో యువ జంట విగతజీవులుగా కనిపించారు. కారులో నుంచి ఒక పిస్టల్, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. మృతులను నోయిడా సెక్టార్–58కు చెందిన 26 ఏళ్ల రేఖ, ఢిల్లీ త్రిలోక్‌పురికి చెందిన 32 ఏళ్ల సుమిత్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించారు.
చాలాకాలంగా ప్రేమలో..
సుమిత్ ముందుగా రేఖను కాల్చి, తర్వాత తాను ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరూ కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసులు కూడా నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. వారు చాలాకాలంగా ప్రేమలో ఉన్నారని, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలుసని విచారణలో బయటపడింది. కారు లోపల నుంచి లాక్ అయి ఉండటం, సుమిత్ చేతిలో పిస్టల్ ఉండడం సూసైట్‌కు పాల్పడ్డారని అనుమానిస్తున్నారు.
కీలకంగా మారిన వాట్సాప్ ఛాటింగ్..
దర్యాప్తులో భాగంగా వాట్సాప్ ఛాట్ బయటపడింది. తనకు రేఖతో 15 ఏళ్ల సంబంధం ఉందని, ఆమె తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు మరొకరిని వివాహం చేసుకోబోతున్నదని సుమిత్ ఛాట్‌లో ఉన్నట్లు గుర్తించారు. “నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. రేఖే దీనికి బాధ్యురాలు” అని కూడా ఛాట్‌లో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఘటన జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేవు. దీంతో సమీప ప్రాంతాల సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.
విదేశీ నంబర్ల నుంచి కాల్స్..
వేర్వేరు కులాలు కావడంతో ఇద్దరికి హత్య చేసి ఉంటారని సుమిత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. విదేశీ నంబర్ల నుంచి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని అంటున్నారు. మరోవైపు రేఖ కుటుంబ సభ్యులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సుమిత్ ఏడాది క్రితం పెళ్లి ప్రస్తావన వచ్చాడని, తాము అంగీకరించలేదని, ఆ తరువాత నుంచి ఇద్దరూ దూరంగా ఉంటున్నారని చెప్పారు. ఘటన జరిగిన రోజు తాను ఇంటికి వస్తున్నానని తన తల్లికి ఫోన్ చేసింది. రెండు–మూడు గంటల తరువాత కూడా ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులను సంప్రదించారు.
ప్రస్తుతం ఈ కేసును పోలీసులు ఆత్మహత్యా? హత్య? కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు లభించాక అసలు కారణం తెలిసే అవకాశం ఉంది.

