’రౌడీలకు నో ప్లేస్.. ఇక్కడ ఉన్నది సీబీఎన్‘
x

’రౌడీలకు నో ప్లేస్.. ఇక్కడ ఉన్నది సీబీఎన్‘

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.


తెలుగుజాతి ఉన్నంతవరకు ఎన్టీఆర్ అమరులే.. ఆయన కీర్తి అజరామరం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రత్యర్థులపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదు. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం.. సీబీఎన్ పాలన అని గుర్తుంచుకోవాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. అరాచక పాలన అంతమైందని.. అభివృద్ధి-సంక్షేమమే ధ్యేయంగా అమరావతి రాజధానిగా నవ్యాంధ్ర ప్రస్థానం సాగుతుందని సీఎం చంద్రబాబు అంటూ వైసీపీ పార్టీ నాయకులు, మాజీ సీఎం వైఎస్ జగన్ పై ధ్వజమెత్తారు.

బాబు మార్క్ పంచ్‌లు

రాష్ట్రంలో శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో రౌడీయిజం చేస్తామంటే ఎవరూ ఊరుకోరు. రాజకీయ ముసుగులో అరాచకాలు సాగిస్తామంటే కుదరదు. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం.. గుర్తుంచుకోండి.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ (CBN) అంటూ ఆయన వైసీపీ పార్టీ శ్రేణులు, మాజీ సీఎం వైఎస్ జగన్ లకు కౌంటర్ ఇచ్చారు. రౌడీలకు ఆంధ్రప్రదేశ్‌లో చోటు లేదని, ప్రజల భద్రత కోసం తాము ఎంతటి పోరాటానికైనా సిద్ధమని పరోక్షంగా జగన్ పైన, వైసీపీ శ్రేణులపైన విమర్శలు గుప్పించారు.

మాది అభివృద్ధి.. మీది దోపిడీ అంటూ మండిపడ్డారు. అభివృద్ధి ప్రాజెక్టులపై గత ప్రభుత్వం చేస్తున్న క్రెడిట్ చోరీ విమర్శలకు చంద్రబాబు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ల్యాండ్, శాండ్, వైన్.. ఇవి వైకాపా సాధించిన ఘనతలు. కానీ సైబరాబాద్‌.. అమరావతి.. కియా.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌.. ఇవి తెలుగుదేశం సృష్టించిన సంపద. ఈ రెండింటికీ అసలు పొంతనే లేదని మండిపడ్డారు. భోగాపురం, గ్రీన్ కో వంటి ప్రాజెక్టులపై విషం కక్కడం మానుకోవాలని, తమ విజన్ ముందు వారి అరాచకాలు నిలబడవని తేల్చి చెప్పారు.

ఇడుపులపాయ రాజధాని అవుతుందా? అంటూ నిప్పులు చిమ్మారు. రాజధాని అంశంపై జగన్ చేస్తున్న వ్యాఖ్యలను చంద్రబాబు ఎద్దేవా చేశారు. సీఎం ఎక్కడుంటే అక్కడే రాజధాని అనడం ఇంగితం లేని మాట. రేపు మీరు బెంగళూరులోనో, ఇడుపులపాయలోనో ఉంటే అది రాజధాని అయిపోతుందా? అని ప్రశ్నించారు. మూడు ముక్కలాటను ప్రజలు నమ్మలేదు కాబట్టే మూడు ప్రాంతాల్లో తమను గెలిపించారని గుర్తు చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ పేర్కొన్నారు.

సంక్షేమంలో అన్న బాట.. సామాన్యుడికి భరోసా

రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ ఆశయాల మేరకు సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నామని సీఎం వివరించారు. పేదల ఆకలి తీర్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే 700 అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, సొంతింటి కల నెరవేర్చే దిశగా ఉగాది పర్వదినం రోజున ఏకకాలంలో 5 లక్షల గృహప్రవేశాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన ధన దుర్వినియోగాన్ని చంద్రబాబు ఎండగట్టారు. ప్రజల భూములపై గత పాలకుల ఫొటోలు పెట్టుకోవడం ఏంటి? సర్వే రాళ్లపై తమ ఫొటోలు వేయించుకోవడం కోసం ఏకంగా రూ.700 కోట్లు తగలేశారు. నేడు ఎక్కడికి వెళ్లినా 80 శాతం ఫిర్యాదులు భూములకు సంబంధించినవే వస్తున్నాయి అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పాలకులు చేసిన తప్పులను సరిదిద్ది, నిజమైన హక్కుదారులకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.

Read More
Next Story