బ్రెయిన్ డ్రెయిన్ కాదు..ఇక బ్రెయిన్ గెయిన్
x
గుంటూరు జీజీహెచ్ లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు

బ్రెయిన్ డ్రెయిన్ కాదు..ఇక బ్రెయిన్ గెయిన్

గుంటూరు జీజీహెచ్‌లో రూ.100 కోట్ల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు.


ఏపీలో మెడిసిన్ చేసిన ఎంతోమంది అమెరికా వెళ్లారని, ఇక్కడ చదువుకుని అమెరికా వెళ్లిపోతున్నారు.. దీనివల్ల బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందని 1995లో సీఎం అయినప్పుడు తనను చాలామంది అడిగారని, రాబోయే రోజుల్లో బ్రెయిన్ గెయిన్ అవుతుందని తాను అన్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, గుంటూరు మెడికల్ కాలేజీ పూర్వ విద్యార్థుల సేవా దృక్పథం తనకు ఎంతో స్ఫూర్తిని ఇచ్చిందని అన్నారు. గుంటూరు జీజీహెచ్‌ ప్రాంగణంలో రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆయన శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..

సమాజానికి తిరిగి ఇవ్వడమే సంస్కృతి

40-50 ఏళ్ల క్రితమే విదేశాలకు వెళ్లినప్పటికీ, చదువుకున్న కాలేజీని గుర్తుపెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున సాయం చేయడం గొప్ప విషయమని సీఎం కొనియాడారు. ఒకప్పుడు మనవాళ్లు అమెరికా వెళ్తుంటే బ్రెయిన్ డ్రెయిన్ అవుతోందని ఆందోళన చెందారు, కానీ ఇప్పుడు అది బ్రెయిన్ గెయిన్ గా మారింది. పూర్వ విద్యార్థులు రూ.100 కోట్లు ఖర్చు చేయడమే కాకుండా, ఆసుపత్రి నిర్వహణ కోసం బ్యాంకులో నగదు డిపాజిట్ చేయడం అభినందనీయం అని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పెరిగిన దాతృత్వం

గుంటూరులో మిలీనియమ్ బ్లాక్ కోసం రూ.16 కోట్లు, విశాఖ ఏయూ మెడికల్ కాలేజీ సెంట్రియన్ బ్లాక్ కోసం రూ.60 కోట్లు, కాకినాడకు రూ.40 కోట్లు, కర్నూలుకు రూ.20 కోట్లు చొప్పున ప్రవాసాంధ్రులు విరాళాలు ఇచ్చి ఆసుపత్రుల అభివృద్ధిలో భాగస్వాములవుతున్నారని వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ-ప్రజల భాగస్వామ్యంతో పీ4 (P4) మోడల్‌కు పిలుపునిచ్చారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు .. సంజీవని

రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, దీనికి గేట్స్ ఫౌండేషన్ సహకారం అందిస్తోందని సీఎం వెల్లడించారు. ఈ ఏడాది 28 జిల్లాల్లో డిజిటల్ హెల్త్ రికార్డులు సిద్ధం చేస్తామని, క్యాన్సర్, న్యూరో సమస్యలపై ప్రత్యేక దృష్టి పెడతామని తెలిపారు. అలాగే, 2026లోనే డ్రోన్ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించారు.

అమరావతి .. క్వాంటమ్ వ్యాలీ

గతంలో సైబరాబాద్‌ను నిర్మించినట్లే, నేడు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టామని చంద్రబాబు చెప్పారు. రాబోయే పదేళ్లలో గుంటూరు, విజయవాడ, మంగళగిరి నగరాలు కలిసిపోతాయని, గుంటూరుకు 182 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు వస్తుందని పేర్కొన్నారు. 2047 నాటికి ఇండియా ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా ఎదగాలని, అందులో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించాలని సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

Read More
Next Story