
దేశంలో ఇంధన కొరత లేదు: చమురు సంస్థలు
పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి భారత్‌కు ఇంధన సరఫరా..
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వివిధ దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి. ఇంధన సరఫరాకు కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేందుకు కొన్ని దేశాల నౌకలకు మాత్రమే ఇరాన్ అనుమతి ఇవ్వడమే అందుకు కారణం. అయితే భారత్‌లో ఇంధన కొరత లేదని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు చెబుతున్నాయి. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ సరఫరాలు సాధారణంగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశాయి.
ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు మరికొంతకాలం ఉండే అవకాశం ఉందని ప్రధాని మోదీ హెచ్చరించిన నేపథ్యంలో..భారత్ ఇతర దేశాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచింది. పశ్చిమ ఆఫ్రికా, లాటిన్ అమెరికా, అమెరికా నుంచి ఇంధనాన్ని పొందుతోంది.
భయాందోళన అవసరం లేదు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) దేశంలో ఇంధన కొరత లేదని తెలిపింది. అన్ని అవుట్‌లెట్‌లలో సమృద్ధిగా నిల్వలు ఉన్నాయని పేర్కొంది. పుకార్లను నమ్మవద్దని, భయంతో ఎక్కువగా కొనుగోళ్లు చేయవద్దని ప్రజలకు సూచించింది.
బీపీసీఎల్ వివరణ..
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) కూడా ఇంధన కొరతపై వస్తున్న వార్తలు పూర్తిగా నిరాధారమని తెలిపింది. దేశంలో తగినంత ముడి చమురు, పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని, సరఫరా వ్యవస్థ సజావుగా నడుస్తోందని పేర్కొంది.
హెచ్‌పీసీఎల్ స్పందన..
హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ (హెచ్‌పీసీఎల్) దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా స్థిరంగా ఉందని తెలిపింది. వినియోగదారులకు ఆందోళన అక్కర్లేదని సూచించింది.
ఎల్‌ఎన్‌జీ, ఎల్‌పీజీపై ప్రభావం..
ఖతార్‌లో సమస్యల వల్ల ఎల్‌ఎన్‌జీ సరఫరా కొంత ప్రభావితమైంది. దీనివల్ల గృహ వినియోగం, సిఎన్‌జీకి ప్రాధాన్యత ఇచ్చి, పారిశ్రామిక వినియోగంలో కోత విధించారు. ఎల్‌పీజీపై ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ అవసరంలో 60 శాతం దిగుమతులపై ఆధారపడటం కారణంగా సరఫరా ఒత్తిడి పెరిగింది. గృహ వినియోగానికి ప్రాధాన్యం ఇచ్చి, హోటళ్లు, రెస్టారెంట్లలో వినియోగాన్ని తగ్గించారు. మొత్తంగా చూస్తే దేశంలో ప్రస్తుతం ఇంధన కొరత లేదని తెలుస్తోంది. ప్రజలు పుకార్లను నమ్మకుండా, సాధారణ వినియోగాన్ని కొనసాగించాలని సూచించాయి.ఇక ఇప్పటివరకు 3,75 వేల మందికి పైగా భారతీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సంప్రదింపులు, భద్రత దిశగా ప్రయత్నాలు కొనసాగాలని ఆయన నొక్కి చెప్పారు.

