సంప్రదాయ విరుద్ధంగా జుట్టు కత్తిరించుకుంటే గర్భాలయంలోకి నో ఎంట్రీ
x

సంప్రదాయ విరుద్ధంగా జుట్టు కత్తిరించుకుంటే గర్భాలయంలోకి నో ఎంట్రీ

గర్భాలయ పవిత్రతపై హైకోర్టు కీలక ఆదేశాలు


దేవాలయాల పవిత్రతను కాపాడటంలో అర్చకుల వేషధారణ, ఆచార వ్యవహారాలు అత్యంత కీలకమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. దేవదాయ శాఖ పరిధిలోని ఆలయాల్లో పనిచేసే అర్చకులు ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వారిని గర్భాలయంలోకి అనుమతించకూడదని న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా సంప్రదాయాలకు విరుద్ధంగా జుట్టు కత్తిరించుకున్న (Modern Cropping) వారు ప్రధాన గర్భాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనర్హులని కోర్టు తేల్చి చెప్పింది.

విదేశీ పర్యటనలు చేస్తే అర్చకత్వానికి దూరం
విదేశీ పర్యటనలు చేసి వచ్చిన అర్చకుల విషయంలో కోర్టు పాత నిబంధనలను గుర్తు చేసింది. ఏ అర్చకుడైనా సరే విదేశీయానం చేసి వస్తే, అతన్ని ప్రధాన ఆలయ గర్భాలయంలో అర్చకత్వం చేయడానికి అనుమతించరాదంటూ 2010లో జారీ చేసిన సర్క్యులర్‌ను తూచా తప్పకుండా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, దేవదాయ శాఖ అధికారులను ఆదేశించింది. సనాతన ధర్మం ప్రకారం సముద్రయానం లేదా విదేశీ ప్రయాణం చేసిన వారు గర్భాలయ విధులకు దూరంగా ఉండాలనే నియమాన్ని కోర్టు ఈ సందర్భంగా బలపరిచింది.
జగద్గురువుల మార్గదర్శకాలే ప్రామాణికం
అర్చకత్వం, గర్భాలయ విధుల విషయంలో ఆధ్యాత్మిక పీఠాల నిర్ణయాలకు కోర్టు పెద్దపీట వేసింది. 2024 డిసెంబర్ 12న శృంగేరి శారదాపీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ మహాతీర్థ భారతీ స్వామి జారీ చేసిన ప్రామాణిక మార్గదర్శకాలను (Standard Protocols) ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది. పీఠాధిపతులు సూచించిన సంప్రదాయ శిరోజాల (జుట్టు) కట్టుబాటు లేని వారు గర్భాలయంలోకి ప్రవేశించడం శాస్త్ర విరుద్ధమని కోర్టు అభిప్రాయపడింది.
విజయవాడ దుర్గమ్మ ఆలయ వివాదం నేపథ్యంలో..
విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో (ఇంద్రకీలాద్రి) కొందరు ప్రధాన అర్చకులు విదేశాలకు వెళ్లి వచ్చినా, అధికారులు వారిని గర్భాలయంలో విధులకు అనుమతిస్తున్నారని డి.ఎస్.ఎస్.ఎస్. సుబ్రహ్మణ్యం సోమయాజీ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు ఈ మేరకు స్పందించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది కే.ఆర్. శ్రీనివాస్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి, ఏపీ ధార్మిక పరిషత్తు నిబంధనలు, పీఠాధిపతుల సూచనలను అమలు చేయాల్సిన బాధ్యత అధికారులపైనే ఉందని స్పష్టం చేశారు.
Read More
Next Story