
లోక్‌సభ స్పీకర్‌పై వీగిన అవిశ్వాస తీర్మానం ..
వాయిస్ ఓటుతో తిరస్కరణ – ప్రతిపక్షాలపై అమిత్ షా తీవ్ర విమర్శలు..
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం లోక్‌సభలో వాయిస్ ఓటుతో తిరస్కరణకు గురైంది. ప్రతిపక్షాల నిరసనల మధ్య జరిగిన ఈ పరిణామంతో సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్ ఎంపీ మహమ్మద్ జావేద్ మార్చి 10న ప్రవేశపెట్టారు. అయితే తీర్మానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆయన ముగింపు వ్యాఖ్యలు చేయకుండానే దానిని ఓటింగ్‌కు పెట్టారు. అనంతరం మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయింది. ఆ తరువాత సభను వాయిదా వేశారు.
ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలపై తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం తీసుకురావడం ప్రజాస్వామ్యానికి, పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత స్పీకర్‌పై ఇలాంటి తీర్మానం రావడం దురదృష్టకరమన్నారు.
స్పీకర్ నిర్ణయంతో ఎవరికైనా భిన్నాభిప్రాయం ఉండవచ్చని, అయితే నిబంధనల ప్రకారం స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయమని షా స్పష్టం చేశారు. లోక్‌సభ మార్కెట్ స్థలం కాదని, సభ్యులు నియమ నిబంధనలను పాటిస్తూ మాట్లాడాలని సూచించారు.
రాజ్యాంగం ప్రకారం స్పీకర్ పార్టీలకు అతీతంగా వ్యవహరించే మధ్యవర్తి పాత్రలో ఉంటారని షా గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి సమగ్రతను ప్రశ్నించడం ప్రజాస్వామ్య వ్యవస్థలపై సందేహాలు రేకెత్తిస్తుందని అన్నారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కూడా షా విమర్శలు గుప్పించారు. లోక్‌సభలో మాట్లాడే అవకాశం లేదని ఫిర్యాదు చేసే రాహుల్ గాంధీకి తగిన సమయం ఇచ్చినా ఆయన మాట్లాడలేదని అన్నారు. పార్లమెంటు సమావేశాల సమయంలో విదేశీ పర్యటనలకు వెళ్లడం వల్లే ఆయన పాల్గొనలేదని ఆరోపించారు.
షా వ్యాఖ్యలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష ఎంపీలు సభ మధ్యకు వచ్చి నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. సభలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చర్చకు అధ్యక్షత వహించిన జగదంబికా పాల్ అవసరమైతే అసభ్య పదాలను రికార్డుల నుంచి తొలగిస్తామని చెప్పారు.
మొత్తంగా ప్రతిపక్షాలు బీజేపీని అప్రతిష్టపాలు చేయడానికి ఈ తీర్మానం తీసుకువచ్చాయని షా ఆరోపించారు. చివరకు వాయిస్ ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.

