NH-167K route map
x
NH-167K route map: Telangana to Andhra Pradesh

ఏమిటీ రాయలసీమ హైవే? ఏయే ఊళ్ల మీదుగా పోతుందీ?

NH-167K ప్రాజెక్టులో భాగంగా కృష్ణా నదిపై నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ పెద్ద టూరిస్ట్ కేంద్రం కానుంది


నంద్యాల జిల్లా కోవెలకుంట్ల వద్ద ఉదయం పూట...
రోడ్డు పక్కన ఎక్స్‌కవేటర్లు, ట్రక్కులు...
పక్కనే నిలబడి పనులు చూస్తున్న స్థానికులు...
“ఇది పూర్తైతే బెంగళూరు వెళ్లడం సగం తలనొప్పి తగ్గిపోతుంది” అంటున్నారు ఓ యువ ఉద్యోగి.
5,6 గంటల్లో బెంగళూరు వెళ్లవచ్చునంటున్నాడు మరో డ్రైవరు..
నేషనల్ హైవే NH-167K మార్గం వెంట మనం పోతుంటే ఇలాంటి సంభాషణలు అనేకం వినవచ్చు.
తెలంగాణ నుంచి రాయలసీమలోకి వచ్చే ఈ కొత్త జాతీయ రహదారిపై ఇప్పుడు నంద్యాల జిల్లా గ్రామాల్లో జోరుగా చర్చసాగుతోంది.

ఏయే ఊళ్ల మీదుగా వెళ్తోంది?

గ్రౌండ్‌లో చూస్తే, ఈ హైవే కాగితాలపై ఉన్న లైన్ కాదు. యాక్షన్ లోకి వచ్చిన ప్లాన్ ఇది. నేరుగా అనేక ఊళ్ల మధ్యగా వెళ్తోంది.
నంద్యాల జిల్లా పరిధిలో NH-167K ఆత్మకూరు నుంచి నంద్యాల మీదుగా సాగతుంది.
కోవెలకుంట్ల, ఉయ్యాలవాడ, దొర్నిపాడు, సంజామల, గోస్పాడు మండలాల్లోని 22 గ్రామాల మీదుగా వెళుతుంది. ప్రస్తుతం ప్రధానంగా పనులు జరుగుతున్నది
నంద్యాల – కోవెలకుంట్ల – నొస్సం మధ్య ఉన్న 62 కిలోమీటర్ల సెక్షన్ లో.
నొస్సం దాటాక ఈ రహదారిని జమ్మలమడుగు – కడప రోడ్డుతో కనెక్ట్ చేయనున్నారు.

పనులు ఎలా సాగుతున్నాయి?

హైవే వెంట ప్రయాణిస్తే బైపాసుల కోసం మట్టిపనులు చేసే వాళ్లు, కల్వర్టుల నిర్మాణంలో బిజీగా ఉండే కార్మికులు, బ్రిడ్జీల ఫౌండేషన్ల కోసం ఐరన్ రాడ్లు, సిమెంట్ బస్తాలతో కుస్తీ పట్టే వాళ్లు కనిపిస్తుంటారు. నంద్యాల జిల్లా సెక్షన్‌లో 3 ప్రధాన బ్రిడ్జీలు, 158 కల్వర్టులు, 4 బైపాసులు రానున్నాయి.
అవి ప్రధానంగా – కోవెలకుంట్ల, రైతునగరం, నొస్సం, గోస్పాడు వద్ద నిర్మిస్తున్నారు.
ఇంజినీరింగ్ అధికారుల ప్రకారం, మార్చి నాటికి బైపాసులు, కల్వర్టుల పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. అవి ప్రారంభమైతే నంద్యాల నుంచి నొస్సం వరకు ప్రయాణం గంటలోపే ఉంటుందని అంచనా.

గ్రామాల్లో అంచనాలు, ఆశలు...

కోవెలకుంట్లలో ఓ చిన్న వ్యాపారి చెప్పింది సింపుల్ మాటల్లో - “ఇప్పటివరకు లారీ వస్తే ఊరి మధ్యలో ట్రాఫిక్ జామ్. బైపాస్ వస్తే వ్యాపారం కూడా ఉంటుంది, రోడ్డు కూడా ఖాళీగా ఉంటుంది.”
నంద్యాల, కర్నూలు జిల్లాల నుంచి బెంగళూరు వెళ్లే వారిలో ఐటీ ఉద్యోగులు, కార్మికులు, చిన్న వ్యాపారులు ఎక్కువ.
ఇప్పటివరకు వారు అవుకు – కొలిమిగుండ్ల – తాడిపత్రి – అనంతపురం రూట్‌లో ట్రాఫిక్, పట్టణాల మధ్య ఇబ్బందులు ఎదుర్కొనేవారు.

NH-167K అందుబాటులోకి వస్తే

బెంగళూరు దూరం 60–65 కిలోమీటర్లు తగ్గుతుంది
ప్రయాణ సమయం ఆరు గంటలలోపే పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు.

శ్రీశైలం బ్యాక్‌వాటర్స్‌పై ఐకానిక్ బ్రిడ్జ్‌

NH-167K ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భాగంగా కృష్ణా నదిపై (శ్రీశైలం బ్యాక్‌వాటర్స్) నిర్మించనున్న ఐకానిక్ బ్రిడ్జ్ నిలవనుంది. ఈ బ్రిడ్జ్‌ను కేంద్ర ప్రభుత్వం కేబుల్-స్టేయిడ్–సస్పెన్షన్ హైబ్రిడ్ డిజైన్‌తో నిర్మించేందుకు ఆమోదం తెలిపింది. సుమారు రూ.1,082–1,083 కోట్ల అంచనా వ్యయంతో ఇది నిర్మించనున్నారు.

ఈ బ్రిడ్జ్ తెలంగాణలోని సోమశిల (నాగర్‌కర్నూల్ జిల్లా) నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సంగమేశ్వరం–ఆత్మకూరు (కర్నూలు జిల్లా) ప్రాంతాలను కలుపుతుంది. NH-167K రూట్‌లో కీలకం కానుంది. ఇది పూర్తయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గడమే కాకుండా, ఒక టూరిజం ల్యాండ్‌మార్క్‌గా మారే అవకాశముంది.

ప్రభుత్వ ఫోకస్

ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై కనెక్టివిటీపై సమీక్ష నిర్వహించిన తర్వాత ఈ హైవే పనులు మరింత స్పీడ్ అందుకున్నాయి.
NH-167K పనులు ప్రస్తుతం ఊపందుకున్నాయి. రోడ్ల విస్తరణ పనులు ముమ్మరం అయ్యాయి. బైపాస్‌లు రూపుదిద్దుకుంటున్నాయి. బెంగళూరు దూరం తగ్గబోతుందన్న నమ్మకం పెరుగుతోంది.
ఇది కూడా చదవండి
Read More
Next Story