
ఏపీలో ఏయే రోడ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటే?
రోడ్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మనకు వినపడుతున్న మాట అసెట్ మానిటైజేషన్ ప్లాన్, అసలేమిటిదీ?
రోడ్ల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ మనకు ఓ మాట వినపడుతోంది ఈమధ్య. దానిపేరే అసెట్ మానిటైజేషన్ ప్లాన్ (ఆస్తుల నగదీకరణ పథకం). కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల లోక్‌సభలో ఈ మాట వాడుతూమరింత వివరణ ఇచ్చారు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) చేపట్టిన ఆస్తుల నగదీకరణ కార్యక్రమ లక్ష్యాలను మంత్రి వివరించారు.
ప్రభుత్వ నిధులతో పూర్తయిన రహదారి ఆస్తుల విలువను లెక్కగట్టడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం దీని ముఖ్య ఉద్దేశమని ఆయన చెప్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే రోడ్లను ప్రైవేటు వాళ్లకు ఇచ్చి వాళ్లిచ్చే డబ్బుతో మళ్లీ రోడ్లు వేయడం అనుకోవచ్చు. ఇలా రోడ్లను తాకట్టు లేదా అమ్మడం వల్ల ఇప్పటివరకు మొత్తం ₹1,52,028 కోట్లు సేకరించినట్లు గడ్కరీ చెప్పారు.
అసలింతకీ ఈ నగదీకరణ అంటే ఏమిటీ?
మామూలుగా ప్రభుత్వం ప్రజల పన్నుల డబ్బుతో జాతీయ రహదారులను నిర్మిస్తుంది. అవి పూర్తయ్యాక టోల్ గేట్ల ద్వారా ఆదాయం సంపాయిస్తుంది. అయితే, ఈ ఆదాయం రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. కానీ ప్రభుత్వానికి అంత సమయం లేదు. అందుకని ఇప్పటికే పూర్తయి, ఆదాయం వస్తున్న రోడ్డును (NH Asset) ఓ 20,30 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థకు లీజుకు ఇస్తుంది. ఆ సంస్థ ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అంటే.. ఉదాహరణకు ఓ రోడ్డు ఖరీదు ₹1000 కోట్లు అనుకుంటే దాన్ని ముందే ఆ ప్రైవేటు సంస్థ ప్రభుత్వానికి చెల్లిస్తుంది. ఆ నిర్ణీత కాలం పాటు ఆ రోడ్డుపై టోల్ వసూలు చేసుకునే హక్కు ఆ సంస్థకు ఉంటుంది.
మానిటైజేషన్ ప్లాన్ 2025–30 లక్ష్యం...
2025 నుండి 2030 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న వేలాది కిలోమీటర్ల జాతీయ రహదారుల ద్వారా నిధులను సేకరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల కల్పన (Infrastructure) కోసం బడ్జెట్‌పై భారం పడకుండా నిధులు సమకూర్చుకోవడం దీని ఉద్దేశం. పాత రోడ్ల ద్వారా వచ్చిన ఈ డబ్బును మళ్ళీ కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, గ్రీన్‌ఫీల్డ్ హైవేల నిర్మాణానికి ఖర్చు చేయడం లక్ష్యం.
ఇది ఎలా జరుగుతుంది?
మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్న విధంగా ఇందులో ప్రధానంగా రెండు రకాల పద్ధతులు ఉన్నాయి. అవి,
TOT- (Toll-Operate-Transfer): ఒక రహదారిని నిర్ణీత కాలం పాటు నిర్వహణ, టోల్ వసూలు కోసం ప్రైవేట్ సంస్థకు అప్పగించడం.
InvIT- (Infrastructure Investment Trust): ఇది ఒక మ్యూచువల్ ఫండ్ లాంటిది. పెద్ద సంస్థలు లేదా పెట్టుబడిదారులు రహదారి ప్రాజెక్టులలో పెట్టుబడి పెడతారు. దానిపై వచ్చే టోల్ ఆదాయాన్ని లాభాలుగా పంచుకుంటారు.
ఏపీలో ఏయే రోడ్లు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని NH-16 (చెన్నై-కోల్‌కతా హైవే) లోని రెండు ముఖ్య భాగాలను అమ్మకానికి సిద్ధం చేశారు. ఒకటి గుండుగొలను–చిన్న అవుటపల్లి రూటు, మరొకటి చిలకలూరిపేట–విజయవాడ రోడ్డు. వీటిని ప్రైవేటు వాళ్లకు అప్పగిస్తే వాళ్లు ఈ రోడ్ల నిర్వహణ బాధ్యత వాళ్లు చూస్తారు. మరమ్మతులు, సర్వీస్ రోడ్ల నిర్వహణ కూడా వాళ్లకే ఇస్తారు.
దీని ద్వారా వచ్చే నిధులను ఆంధ్రప్రదేశ్‌లో లేదా దేశంలో ఇతర కొత్త హైవే ప్రాజెక్టుల కోసం కేంద్రం వాడుతుంది.
ఇందులో రోడ్డు యాజమాన్య హక్కులు ప్రభుత్వానికే ఉంటాయి. లీజు కాలం ముగిశాక మళ్ళీ ఆ రహదారి పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకే వస్తుంది. ఇది ఆస్తిని అమ్మడం కాదు, కేవలం దానిపై వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే నగదుగా మార్చుకోవడం (Recycling of Capital) మాత్రమేనని మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు.
Next Story

