హమాస్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
x

హమాస్- ఇజ్రాయెల్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం

ఈ రోజు కేబినేట్ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్న నెతన్యాహూ


హమాస్ - ఇజ్రాయెల్ మధ్య రెండు రోజులుగా దాగుడుమూతలు ఆడుతున్న కాల్పుల విరమణ ఒప్పందం పై తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పందించారు. బందీల విడుదలకు సంబంధించి మంత్రివర్గ సమావేశాన్ని ఈ రోజు ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు.

ఒప్పందం ఖరారు విషయంలో కొన్ని అడ్డంకులను కావాలనే హమాస్ సృష్టిస్తోందని ఇంతకముందే ప్రధాని నెతన్యాహూ ఆరోపించారు. అయితే తాజాగా ఆయన వెనక్కి తగ్గారు. అందులో భాగంగా మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ప్రకటించారు.
బైడెన్ ప్రకటన..
ఇజ్రాయెల్ - హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరి బందీల విడుదలకు అంగీకరించాయని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. టెల్ అవీవ్ గాజాలో పోరాటాన్ని నిలిపివేస్తుందని ఆయన చెప్పారు. యునైటెడ్ స్టేట్స్ అనేక నెలల తీవ్రమైన దౌత్యం, ఈజిప్టు, ఖతార్ ల సహకారంతో హమాస్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరాయని ఆయన అన్నారు. ఇది తన విదేశాంగ విధానం సాధించిన గొప్ప విజయం అని ప్రకటించుకున్నారు.
ప్రస్తుతం కుదిరిన ఒప్పందం ప్రకారం గాజాలో పోరాటాన్ని ఇజ్రాయెల్ ఆపివేస్తుంది. అలాగే అక్కడి పౌరులకు మానవతా సాయం ఇస్తుందని, అలాగే 15 నెలలుగా బందీలుగా ఉన్నఇజ్రాయెల్ వాసులను వారి కుటుంబంతో కలుపుతుందని బైడెన్ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఖతార్ ప్రధాన మంత్రి కూడా ధృవీకరించారు. ఒప్పందం ప్రకారం 33 మంది బందీలను విడుదల చేస్తారని ఆయన చెప్పారు.
ఒప్పందం ఖరారు చేయడానికి మొదటి నుంచి అమెరికా, ఈజిప్టు, ఖతార్, తీవ్రంగా ఇరుపక్షాలతో మాట్లాడింది. చివరకు కాల్పుల విరమణ ఒప్పందం ఓ కొలిక్కి వచ్చింది.
అక్టోబర్ 7, 2023 నాడు హమాస్ పాశవికంగా దాడి చేసి 251 మంది యూదులను బందీలుగా పట్టుకెళ్లింది. తరువాత ఐడీఎఫ్ దాడులు ప్రారంభించింది. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం ఈ దాడుల్లో 46 వేల మంది మరణించారు. ఇందులో ఎక్కువగా సాధారణ ప్రజలే ఉన్నారు. బాంబు దాడుల వల్ల దాదాపుగా గాజా శిథిలమైంది. ఎక్కువ మంది పాలస్తీనియన్లు ఇప్పుడు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తూ సంచార జీవితం గాజాలోనే గడుపుతున్నారు.


Read More
Next Story