నరవాణే పుస్తక వివాదం: పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసుల నోటీసు
x

నరవాణే పుస్తక వివాదం: పెంగ్విన్ ఇండియాకు ఢిల్లీ పోలీసుల నోటీసు

పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని స్పష్టం చేసిన పబ్లిషర్..


Click the Play button to hear this message in audio format

ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణే రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ అనే పుస్తకంపై ఇంకా వివాదం కొనసాగుతోంది. ఈ పుస్తక మాన్యుస్క్రిప్ట్ అనధికారికంగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ కావడంతో పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియాకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ నోటీసులు జారీ చేసింది. మాన్యుస్క్రిప్ట్‌ను అక్రమంగా పంపిణీ చేశారనే ఆరోపణలపై ఇప్పటికే ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టిన విషయం తెలిసిందే. పలు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలని ప్రచురణ సంస్థను కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ వివాదం లోక్‌సభలో మరింత ముదిరింది. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఈ పుస్తకం నుంచి కొన్ని భాగాలను చదవడానికి ప్రయత్నించగా, ట్రెజరీ బెంచీల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ప్రచురించని పుస్తకాన్ని పార్లమెంట్‌లో ఉదహరించలేమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరం తెలిపారు. స్పీకర్ ఓం బిర్లా కూడా అదే అభిప్రాయంతో రాహుల్‌కు కోట్ చేయడానికి అనుమతి నిరాకరించారు.

పార్లమెంట్ వెలుపల పుస్తకం హార్డ్‌బౌండ్ కాపీని రాహుల్ గాంధీ చూపిస్తూ ప్రభుత్వ వాదనను ప్రశ్నించారు. ఈ కాపీ తనకు ఎలా అందిందనే అంశంపై కూడా చర్చలు చెలరేగాయి.

ఇటు పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా స్పందించింది. పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదని, రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి అవసరమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఉన్న PDFలు లేదా కాపీలు కాపీరైట్ ఉల్లంఘన కిందకు వస్తాయని తెలిపింది.

అయితే రాహుల్ గాంధీ 2023లో నరవాణే చేసిన ట్వీట్‌ను ఉటంకిస్తూ.. పుస్తకం ప్రీ–ఆర్డర్‌కు అందుబాటులో ఉందని వాదించారు. దీనిపై ప్రచురణకర్త మరింత స్పష్టతనిస్తూ.. ప్రీ–ఆర్డర్ మాత్రమే ప్రారంభమైందని, అమ్మకాలు ఇంకా మొదలుకాలేదని వెల్లడించింది. వివాదం ముదురుతున్న నేపథ్యంలో.. మాన్యుస్క్రిప్ట్ డిజిటల్, ఇతర రూపాల్లో అక్రమంగా చెలామణి అవుతున్న అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More
Next Story