ముగ్గురు గిరిజన యువతులను మింగేసిన ములగుమ్మి జలపాతం
x

ముగ్గురు గిరిజన యువతులను మింగేసిన ములగుమ్మి జలపాతం

కళ్ల ముందే మునిగిపోతున్న ప్రాణస్నేహితులను కాపాడేందుకు దూకి తీవ్ర గాయాలపాలైన అంజలి.


పండగ పూట ఆ ఇంట పచ్చని నవ్వులు విరియాలి.. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ ఇల్లు వల్లకాడయ్యింది. సరదాగా గడపాలని వెళ్లిన జలపాతం.. ఆ ముగ్గురు గిరిజన యువతుల జీవితాలకు మృత్యుపాశమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఈ విషాద ఘటన మారుమూల గిరిజన గ్రామాల్లో తీరని శోకాన్ని నింపింది. స్నేహితులను కాపాడబోయి మరో యువతి తీవ్రంగా గాయపడటం ఆ ప్రాంతవాసులను మరింత కలచివేస్తోంది.

పండగ ఉత్సాహం.. ప్రాణసంకటమై
హుకుంపేట మండలం జంబువలస గ్రామంలో ఇటుకల పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. ఈ ఉత్సాహంలో భాగంగానే సాలెపు త్రిష (17), సాలెపు పవిత్ర (16), సాలెపు రత్నకుమారి (16) , అంజలి అనే నలుగురు స్నేహితులు అనంతగిరి మండలంలోని ములగుమ్మి జలపాతం వద్దకు వెళ్లారు. అప్పటివరకు ఆడుతూ పాడుతూ గడిపిన ఆ యువతుల నవ్వులు, మరికాసేపటికే ఆర్తనాదాలుగా మారతాయని ఎవరూ ఊహించలేదు.
ఫోటోల వేళ..మృత్యువు పిలుపు
జలపాతం జలజలల మధ్య త్రిష, పవిత్ర, రత్నకుమారి స్నానాలు చేస్తుండగా, అంజలి ఒడ్డున ఉన్న బండరాయిపై నిలబడి ఆ మధుర క్షణాలను తన సెల్‌ఫోన్‌లో బంధిస్తోంది. ఆ సంతోషం ఎంతో సేపు నిలవలేదు. నీటిలో ఉన్న ముగ్గురు యువతులు పాచి పట్టిన రాళ్లపై నుంచి అదుపు తప్పి లోతైన గుండంలో పడిపోయారు. చూస్తుండగానే ఆ ముగ్గురు నీటి అలల్లో కలిసిపోవడం, ఆరాటంతో అంజలి పెట్టిన కేకలు అరణ్య రోదనగా మిగిలిపోయాయి.
స్నేహం కోసం సాహసం.. మిగిలింది గాయం
తన కళ్ల ముందే ప్రాణస్నేహితులు మునిగిపోతుండటాన్ని తట్టుకోలేకపోయిన అంజలి, వారిని ఎలాగైనా కాపాడాలనే ఆరాటంతో తాను నిలబడిన బండరాయిపై నుంచి కిందకు దూకేసింది. కానీ, విధి వెక్కిరించింది. ఆమె నీటిలో కాకుండా పక్కనే ఉన్న బండరాళ్లపై పడటంతో తీవ్రంగా గాయపడింది. అటు స్నేహితులను కాపాడుకోలేక, ఇటు తాను కదలలేక ఆ యువతి అనుభవించిన క్షోభ వర్ణనాతీతం.
ఒకే కుటుంబం.. మూడు దీపాలు ఆరిపోయాయి
ఈ ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువతులు ఒకే ఉమ్మడి కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. ఇంటర్ పరీక్షలు రాసి ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న త్రిష, ఇటీవలే పదో తరగతి రాసి ఇంటికొచ్చిన రత్నకుమారి.. ఇలా ఉజ్వల భవిష్యత్తు ఉన్న బిడ్డలు విగతజీవులుగా పడి ఉండటం చూసి జంబువలస గ్రామం శోకసముద్రంలో మునిగిపోయింది. ఒక్కరోజు క్రితం వరకు పండగ కళతో వెలిగిన ఆ ఇల్లు, నేడు ఆరిపోయిన దీపాలతో మూగబోయింది.
Read More
Next Story