అమ్మా..నేనేం పాపం చేశా? ఏడుస్తున్న పసికందును పొయ్యిలో విసిరేసిన తల్లి
x
ఊహాత్మక చిత్రం

అమ్మా..నేనేం పాపం చేశా? ఏడుస్తున్న పసికందును పొయ్యిలో విసిరేసిన తల్లి

హైదరాబాద్ దుండిగల్‌లో జరిగిన ఈ దారుణ ఘటన గుండెను పిండేస్తోంది.


హైదరాబాద్ దుండిగల్‌లో జరిగిన ఈ దారుణ ఘటన గుండెను పిండేస్తోంది. కన్నతల్లే యమదూతగా మారిన ఈ ఉదంతం హృదయవిదారకం. కడుపున పుట్టిన బిడ్డ ఆకలికో, అనారోగ్యానికో ఏడిస్తే ఆ తల్లి గుండె విలవిలలాడాలి.. కానీ, ఇక్కడ ఈ తల్లి మాటల్లో వర్ణించలేని దారుణానికి ఒడిగట్టింది. ఏడుపు ఆపలేదన్న అసహనమో, పేదరికం తెచ్చిన శాపమూ తెలియదు కానీ.. కేవలం రెండు నెలల పసిగుడ్డును కట్టెల పొయ్యిలో వేసి సజీవ దహనం చేసింది. బౌరంపేటలో జరిగిన ఘటన చుట్టుపక్కల వారిని నివ్వెరపోయేలా చేసింది.
బిహార్‌కు చెందిన ఓ వలస కూలీ కుటుంబం బౌరంపేటలోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌ వద్ద నివసిస్తోంది. సోమవారం రాత్రి ఆ రెండు నెలల పసికందు ఆపకుండా ఏడుస్తున్నాడని సదరు తల్లి తీవ్ర అసహనానికి లోనైంది. పిల్లాడి ఏడుపు వినపడకుండా ఉండటానికి నోట్లో గుడ్డలు కుక్కింది. అంతటితో ఆగకుండా, ఆ పసిప్రాణం తప్పించుకోకుండా కాళ్లు, చేతులు కట్టేసి రగులుతున్న కట్టెల పొయ్యిలో వేసింది. ఆ మంటల్లో ఆ పసికందు కాలి బూడిదైపోయాడు.
వెలుగులోకి వచ్చిందిలా..
బయటకు వెళ్లిన తండ్రి తిరిగి వచ్చేసరికి బిడ్డ కనపడకపోవడంతో అనుమానం వచ్చి ఆరా తీశాడు. పొయ్యిలో కాలిపోయిన బిడ్డను చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. భార్యాభర్తల మధ్య జరిగిన పెనుగులాట, గొడవతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన దుండిగల్ పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
మానసిక స్థితిపై అనుమానాలు
ఈ ఘటన వెనుక కేవలం అసహనమే ఉందా లేక ఆ తల్లి ఏదైనా మానసిక సమస్యతో బాధపడుతోందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వలస కూలీల జీవితాల్లో ఉండే ఒత్తిడి, పేదరికం ఇలాంటి దారుణాలకు దారితీస్తున్నాయా అన్న చర్చ కూడా మొదలైంది. ఏది ఏమైనా, "అమ్మ" అనే పదానికే మచ్చ తెచ్చేలా జరిగిన ఈ ఘటన స్థానికులను కన్నీటి పర్యంతం చేస్తోంది.
Read More
Next Story