
కొడుకు మనోహర్ ప్రాణాలను కాపాడి అగ్నికి ఆహుతైన అమ్మ రమా
కాలుతున్న బస్సులో కొడుకును కాపాడి మంటలకు ఆహుతైన అమ్మ!
మృత్యు ఒడిలోనూ మమకారం: కొడుకును నెట్టేసి, కాలిపోయిన తల్లి
మార్చి 26, గురువారం ఉదయం 6 గంటలు దాటింది... బస్సు మార్కాపురం దాటి రాయవరానికి చేరువలో ఉంది. వాళ్లు ప్రయాణించిన సమయం ఇంకో గంటకు పైగా ఉంది. రోడ్డుపై పెద్దగా జనసంచారం లేదు.
అంతలో ఉన్నట్టుండి ఒక్కసారిగా పెద్ద శబ్ధం.. ప్రైవేటు బస్సు మరో టిప్పర్ ను ఢీ కొట్టింది. బస్సులో హాహాకారాలు, ఇంజన్ మొదలు చివరి దాకా క్షణాల్లో మంటలు.. అరుపులు కేకలతో ఏమవుతుందో అర్థమయ్యేలోపే చాలా మందికి మంటలంటుకున్నాయి.
మాగన్నుగా నిద్రలో ఉన్న ఆ తల్లికి ఏమనిపించిందో ఏమో కొడుకు వైపు చూసే సరికే బస్సు కిటికీలకున్న కర్టెన్లు అంటుకున్నాయి. అవి కొడుకు దరి చేరుతున్నాయని భావించిన ఆమె ఒక్కుదుటున కొడుకుని బస్సులోంచి తోసేసింది. ఈలోపు తన వంటికి మంటలు అంటుకున్నాయి. అయినా వాటినేటినీ ఆమె లెక్కచేయలేదు. కన్నపేగు బంధమే ప్రధానమనుకుంది.
ఈ హృదయ విదారక దృశ్యం ఇవాళ మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద దగ్ధమైన హరికృష్ణ ప్రైవేటు బస్సులోనిది. ఇంకో గంటలో ఇంటికి చేరుకుంటామనగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ బస్సులో ప్రయాణిస్తున్న ఓ తల్లి తన కుమారుణ్ణి కాపాడుకునేందుకు పడిన తాపత్రయం అది.
కనిగిరి మండలం మందాడివారిపల్లికి చెందిన ఉప్పు రమాదేవి(45), కొడుకు మనోహర్ తో కలిసి జగిత్యాల నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మందాడివారిపల్లికి 80 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగింది. మనోహర్ కు మంటలు అంటుకుంటున్న దశలో తల్లి రమాదేవి కుమారుణ్ణి బయటికి నెట్టి వేసి తాను మంటల్లో చిక్కుకున్నారు. లోపలి నుంచి బయటికి రాలేని దుస్థితిలో ఆమె అగ్నికి ఆహుతి అయ్యారు.
కుమారుడి కళ్లెదుటే తల్లి హాహాకారాలతో కాలిపోవడం వర్ణనాతీతం. ఆ తల్లి తన శరీరాన్ని అగ్నికి ఆహుతి ఇచ్చి, తన రక్తాన్ని (కొడుకును) ప్రాణాలతో కాపాడుకుంది. 'అమ్మ' అనే రెండక్షరాల వెనుక ఉండే త్యాగం, ఆ మంటల కంటే శక్తివంతమైనదని ఆమె నిరూపించింది. కడుపులో ఉండగానే కాదు పెద్దయ్యాక కూడా పేగుబంధాన్ని కాపాడి తల్లి ప్రేమను చూపడం అంటే ఇదేనేమో అంటూ మందాడివారిపల్లి గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story

