
అధికారానికి దూరంగా ఆర్ఎస్ఎస్: మోహన్ భగవత్
సమాజంలో ఏ వర్గానికి వ్యతిరేకంగా పనిచేయదన్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్
ఆర్ఎస్ఎస్ రాజకీయ అధికారానికి ఆశపడదని సంస్థ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ స్పష్టం చేశారు. హిందూ సమాజ ఐక్యతే తమ ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. ఫిబ్రవరి 20న మీరట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 950 మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ఐక్యత, వ్యక్తిత్వ వికాసం, దేశ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ ఏ వర్గానికి వ్యతిరేకంగా పనిచేయదన్నారు. హిందూ సమాజ అభ్యున్నతికి కట్టుబడి ఉందన్నారు.
‘హిందూ’ అనే పదం కులానికి సంబంధించినది కాదని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని పేర్కొన్నారు. పూజా విధానాలు, ఆచారాలు వేర్వేరు అయినా సమాజ ఐక్యత అవసరమని తెలిపారు. ఐక్యత బలహీనపడితే దేశం సంక్షోభాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
సంస్థ నాలుగు ప్రధాన సూత్రాలను ఆయన వివరించారు. విలువల పెంపకం, సనాతన సంస్కృతి, ధర్మ భావన, సత్య సాధన వాటిలో ముఖ్యమన్నారు. దేశ నిర్మాణం ఒక్క సంస్థ బాధ్యత కాదని, సమాజం మొత్తం భాగస్వామ్యం కావాలన్నారు. క్రీడలు ప్రజలను ఏకం చేసే శక్తివంతమైన మాధ్యమమని చెప్పారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.
1857 తొలి స్వాతంత్ర్య సమరంలో మీరట్ పాత్రను గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో 1925లో ఆర్ఎస్ఎస్ స్థాపన జరిగిందన్నారు. ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఉన్న భగవత్, లక్నోలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలుసుకున్నారు.

