పోలాండ్‌లో డోబ్రీ మహారాజాకు మోదీ నివాళి
ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నమోదీ పోలాండ్ రాజధాని వార్సాను సందర్శించారు. అక్కడి జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ (ది డోబ్రీ మహారాజా) మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.
కరుణ, మానవత్వం ‘‘శాంతియుత ప్రపంచానికి’’ పునాదులని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం (ఆగస్టు 21) పోలాండ్ రాజధాని వార్సాను సందర్శించారు. అక్కడి జామ్ సాహెబ్ ఆఫ్ నవనగర్ (ది డోబ్రీ మహారాజా) మెమోరియల్ వద్ద నివాళులర్పించారు.
1942లో జరిగిన రెండో ప్రపంచ యుద్ధంలో పోలాండ్‌ను నాజీ జర్మనీ, సోవియట్ రష్యా ఆక్రమించాయి. ఆ సమయంలో ఆక్రమిత పోలాండ్, సోవియట్ శిబిరాల నుంచి తప్పించుకున్న వెయ్యి మందికి పైగా పోలిష్ పిల్లలకు నవనగర్ దిగ్విజయ్‌సిన్హ్‌జీ రంజిత్‌సిన్హ్‌జీ జడేజా ఆశ్రయం కల్పించాడు. అప్పటి నుంచి ఆయనను జామ్ సాహెబ్‌గా పిలవడం ప్రారంభించారు. ఆయన చిరకాలం గుర్తుండిపోవాలని పోలాండ్‌లోని 8 పోలిష్ ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలలకు జామ్ సాహెబ్ పేరు కూడా పెట్టారు. ప్రస్తుతం జీవించి ఉన్న పోలిష్ పిల్లలంతా అసోసియేషన్‌గా ఏర్పడి, ఏటా పోలాండ్ ప్రధాన నగరాల్లో ఒక చోట సమావేశమవుతారు. జామ్ సాహెబ్‌ను పోలాండ్‌లో డోబ్రీ మహారాజాగా గుర్తుంచుకుంటారు' అని మోదీ కొన్ని ఫోటోలను ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
కొల్హాపూర్ మెమోరియల్..
అనంతరం మోదీ వలివాడే-కొల్హాపూర్ స్మారక వద్ద నివాళులర్పించారు. ‘‘ఛత్రపతి శివాజీ మహారాజ్ నుంచి ప్రేరణ పొందిన కొల్హాపూర్ రాజకుటుంబం రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో మానవత్వాన్ని చాటుకుంది. సుమారు 5వేల మంది పోలిష్ శరణార్థ మహిళలు, పిల్లలకు అండగా నిలిచింది”అని కొన్ని ఫోటోలను మోదీ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. అంతకుమునుపు మోదీ కొల్హాపూర్ స్మారకం వద్ద పోలాండ్ ప్రజలు, కొల్హాపూర్ రాజకుటుంబ వారసులతో ప్రధాని సమావేశమయ్యారు.