సౌత్ బ్లాక్‌లో మోదీ చివరి కేబినెట్‌ మీట్ ఎప్పుడంటే..
x

సౌత్ బ్లాక్‌లో మోదీ చివరి కేబినెట్‌ మీట్ ఎప్పుడంటే..

ప్రధాని మోదీ శుక్రవారం సౌత్ బ్లాక్‌లో కేంద్ర కేబినెట్‌ చివరి సమావేశానికి అధ్యక్షత వహించాక.. కొత్త భవనం ‘సేవా తీర్థ్’కు మారనున్నారు.


Click the Play button to hear this message in audio format

ప్రధాని మోదీ (Narendra Modi) దేశ పాలనా చరిత్రలో ఒక ముఖ్య ఘట్టానికి నాంది పలికారు. సౌత్ బ్లాక్‌లో కేంద్ర మంత్రివర్గ ప్రత్యేక సమావేశానికి శుక్రవారం ఆయన అధ్యక్షత వహించనున్నారు. ప్రధాని కార్యాలయం (PMO) కొత్త భవనం ‘సేవా తీర్థ్’ కు మారే ముందు సౌత్ బ్లాక్‌లో జరిగే ఇది చివరి కేబినెట్‌ సమావేశం ఇది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. సమావేశం అనంతరం పీఎంవో అధికారికంగా కొత్త భవనానికి మారిపోతుంది.

బ్రిటిష్‌ కాలంనాటి సచివాలయ సముదాయంలో ఉన్న సౌత్ బ్లాక్‌.. దేశ పరిపాలనా వ్యవస్థలో దాదాపు శతాబ్ద కాలంగా కీలక పాత్ర పోషించింది. 1900 ప్రారంభంలో బ్రిటిష్‌ ఆర్కిటెక్ట్‌ హెర్బర్ట్‌ బేకర్‌ రూపకల్పన చేసిన ఈ భవనం బ్రిటిష్‌ రాజ్‌ పాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిర్మించారు. స్వాతంత్ర్యం తరువాత కూడా కేంద్ర ప్రభుత్వ అత్యున్నత కార్యాలయాలు ఇక్కడే కొనసాగాయి.

1921 నుంచి నార్త్‌ బ్లాక్‌, సౌత్‌ బ్లాక్‌లు దేశ పరిపాలనా కేంద్రాలుగా నిలిచాయి. కేంద్ర మంత్రిత్వ శాఖలు, ప్రధానమంత్రి కార్యాలయం, హోం శాఖ వంటి కీలక విభాగాలు ఇక్కడి నుంచే పనిచేశాయి. అయితే ఇటీవల పరిపాలనను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నూతన కార్యాలయ సముదాయాలను నిర్మించింది. ఈ క్రమంలో ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ నార్త్‌ బ్లాక్‌ను ఖాళీ చేసి కొత్త కార్యాలయానికి మారింది.

ప్రభుత్వం ఈ చారిత్రాత్మక భవనాలను భవిష్యత్తులో ‘యుగే యుగీన్ భారత్‌ నేషనల్‌ మ్యూజియం’గా మార్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. భారతదేశ నాగరికత, సంస్కృతి, చరిత్రను ప్రతిబింబించే ప్రపంచ స్థాయి మ్యూజియంగా ఈ సముదాయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం ఉన్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వలస పాలన అవశేషాల నుంచి పరిపాలనా వ్యవస్థను విముక్తి చేయాలనే ప్రభుత్వ దీర్ఘకాల దృష్టిలో భాగంగానే ఈ మార్పులు చేపడుతున్నట్టు స్పష్టం చేస్తున్నారు.

ప్రధానమంత్రి కార్యాలయం బుధవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 13న కొత్త ప్రధానమంత్రి కార్యాలయ భవనం ‘సేవా తీర్థ్’తో పాటు కర్తవ్య భవన్‌ 1, 2లను ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం దేశ పరిపాలనా నిర్మాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆధునిక, సమర్థవంతమైన, ప్రజలకు మరింత చేరువైన పాలనా వ్యవస్థను నిర్మించాలనే ప్రభుత్వ సంకల్పానికి ఇది ప్రతీకగా నిలుస్తుందని వెల్లడించారు.

ఈ మార్పుతో దేశ పరిపాలనా వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుండగా, సౌత్‌ బ్లాక్‌లో జరిగే ఈ చివరి కేబినెట్‌ సమావేశం చారిత్రాత్మక ప్రాధాన్యతను సంతరించుకుంది. శతాబ్ద కాలంగా దేశ అధికార కేంద్రంగా నిలిచిన భవనాలు ఇకపై మ్యూజియంలుగా మారబోతుండటం భారత పరిపాలనా చరిత్రలో ఒక యుగానికి ముగింపు పలుకుతున్నట్టుగా భావిస్తున్నారు.

Read More
Next Story