ఈ ఏడు అడుగులు కలిసి నడుద్దాం: కరేబియన్ దేశాలకు ప్రధాని మోదీ సూచన
x

ఈ ఏడు అడుగులు కలిసి నడుద్దాం: కరేబియన్ దేశాలకు ప్రధాని మోదీ సూచన

బ్రెజిల్ లో ముగిసిన జీ20 సమావేశాల తరువాత ప్రధాని నరేంద్ర మోదీ గయానా లో పర్యటించారు. అక్కడ కరేబియన్ దేశాల అధినేతలతో చర్చలు జరిపి కొన్ని కీలక ప్రతిపాదనలు..


భారత్ - కరేబియన్ దేశాల మధ్య సంబంధాలను బలపడాలంటే వాణిజ్యం, సాంకేతికత, పర్యాటక రంగం సహ ఏడు అంశాలపై దృష్టి పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి చెందిన నేతలతో చర్చలు జరుపుతున్న సందర్భాల్లో ప్రధాని ఈ ప్రతిపాదన చేశారు.

బ్రెజిల్ రాజధాని రియో డీ జనీరో లో జరిగిన జీ20 సమావేశాలకు హాజరైన మోదీ, బుధవారం కరేబియన్ దేశమైన గయానా చేరుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత భారత దేశాధినేత తొలిసారిగా ఆ దేశంలో పర్యటించారు. రెండో ఇండియా-కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) సమ్మిట్‌లో పాల్గొన్న ఆయన కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులతో కలిసిన సందర్భంగా ఈ సూచనలు చేశారు.

'CARICOM'తో సంబంధాలు బలోపేతం..
ఈ సమావేశంలో ఆర్థిక సహకారం, వ్యవసాయం, ఆహార భద్రత, ఆరోగ్యం, ఫార్మాస్యూటికల్స్, సైన్స్, ఆవిష్కరణలు వంటి రంగాలలో సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై నాయకులు చర్చలు జరిపారు. సమ్మిట్ సందర్భంగా, భారత్ CARICOM మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి మోదీ ఏడు కీలక సూత్రాలను ప్రతిపాదించారు.
ఆయన జాబితా చేసిన ఏడు అంశాలను కెపాసిటీ బిల్డింగ్, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ, రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ క్లైమేట్ చేంజ్, ఇన్నోవేషన్, టెక్నాలజీ అండ్ ట్రేడ్, క్రికెట్ అండ్ కల్చర్, ఓషన్ ఎకానమీ, చివరిది మెడిసిన్ - హెల్త్‌కేర్ ఈ రంగాల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అవుతాయని, ఆర్థికంగా లాభిస్తుందని మోదీ పేర్కొన్నారు.
"వాణిజ్యం, సాంకేతికత, పర్యాటకం, ప్రతిభ, సంప్రదాయాన్ని ప్రోత్సహించడానికి, అన్ని దేశాల ప్రైవేట్ రంగాన్ని, ప్రజలతో అనుసంధానించడానికి ఆన్‌లైన్ పోర్టల్‌ను రూపొందించుకోవచ్చని" అని మోదీ అన్నారు.
" భారత్ SME (చిన్న, మధ్యతరహా పరిశ్రమలు) రంగంలో ముందుకు సాగుతోంది. గత సంవత్సరం భారతదేశం-CARICOM సమావేశంలో, మేము SME రంగాలకు ఒక మిలియన్ డాలర్ల గ్రాంట్‌ను ప్రకటించాము. మేము ఇప్పుడు దాని అమలుపై దృష్టి పెట్టాలి" అని మోదీ అన్నారు.
CARICOM దేశాల కోసం ‘కర్మయోగి’ లాంటి పోర్టల్
భారత్, కారికామ్ ప్రాంతవాసుల కోసం ఓ ఫోరెన్సిక్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సాయం చేస్తామని కూడా మోదీ హామీ ఇచ్చారు. దేశంలో సివిల్ సర్వెంట్ల సేవలను బలోపేతం చేయడానికి కర్మయోగి అనే పోర్టల్ ను తీసుకొచ్చామని, అలాంటి సేవలను కరేబియన్ దేశాలకు కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ పోర్టల్‌లో సాంకేతికత, పరిపాలన, చట్టం, విద్యపై ఆన్‌లైన్ కోర్సులు ఉన్నాయి.
CARICOM ప్రభుత్వాధినేతలు - మోదీ చివరిసారిగా 2019లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) 74వ సెషన్‌లో కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా భారతదేశం నుంచి 150 మిలియన్ డాలర్ల క్రెడిట్ లైన్ ద్వారా పునరుత్పాదక ఇంధనం- వాతావరణ మార్పులలో సహకార విధానాలపై చర్చించారు.
ప్రధాని మోదీ తో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో గయానా ప్రెసిడెంట్ ఇర్పాన్ అలీ మాట్లాడుతూ.. " వూహన్ వైరస్ కాలంలో ఇక్కడ ప్రజలకు మీరు అందించిన నిస్వార్థ సేవలకు ధన్యవాదాలు. మీ వ్యాక్సిన్లు అద్భుతంగా పనిచేశాయి. అంతర్జాతీయ సమాజంలో భారతదేశానికి ప్రభావవంతమైన వాయిస్ ఉంది. మీరు గ్లోబల్ సౌత్ కు ప్రభావవంతంగా నాయకత్వం వహిస్తున్నారు. G20 లో మీ ఇటీవలి అధ్యక్ష పదవి... గ్లోబల్ సౌత్ ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో మీ నిబద్ధతను నొక్కి చెబుతుంది." అని ఇర్పాన్ అలీ అన్నారు. MEA ప్రకారం, గయానాలో దాదాపు 3,20,000 మంది భారతీయులు ఉన్నారు.
మోదీ సుడిగాలి పర్యటన..
కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) అనేది ఇరవై ఒక్క దేశాల సమూహం. ఇందులో 15 సభ్యదేశాలు కాగా, మరో ఆరు అసోసియేట్ దేశాలు ఉన్నాయి. ఇది దాదాపు పదహారు మిలియన్ల పౌరులకు నివాసంగా ఉంది, వీరిలో 60 శాతం మంది 30 ఏళ్లలోపు వారు. ఇక్కడి స్థానిక ప్రజలు, ఆఫ్రికన్లు, భారతీయులు, యూరోపియన్లు, చైనీస్, పోర్చుగీస్, జావానీస్ వంటి ప్రధాన జాతి సమూహాలకు చెందినవారు అని అక్కడి గణాంకాలు తెలియజేస్తున్నాయి.
ప్రధానమంత్రి బ్రెజిల్ నుంచి బయలుదేరడానికి కంటే ముందు, G20 సమ్మిట్‌లో పాల్గొన్న US అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, UK ప్రధాన మంత్రి కైర్ స్టార్‌మర్‌తో సహా ప్రపంచ నాయకులతో సమావేశమయ్యారు. అంతకుముందు, మోదీ నైజీరియాకు వెళ్లారు. అక్కడ అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబుతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. భారతీయ సమాజంతో అప్యాయంగా మాట్లాడారు.


Read More
Next Story