
‘చొరబాటే అతిపెద్ద సవాలు’
బంగ్లాదేశ్ శరణార్థులకు ఆందోళన అక్కర్లేదన్న ప్రధాని మోదీ
పశ్చిమ బెంగాల్(West Bengal)లోని టీఎంసీ(TMC) ప్రభుత్వంపై ప్రధాని మోదీ(PM Modi) శనివారం తీవ్ర విమర్శలు గుప్పించారు. భారీ చొరబాట్లు రాష్ట్ర జనాభా సంఖ్యను మార్చేశాయన్నారు. మాల్డా, ముర్షిదాబాద్ లాంటి జిల్లాల్లో అల్లర్లకు దారితీశాయని, అధికార పార్టీ ఉదాసీన వైఖరే అందుకు కారణమని ఆరోపించారు. రెండు రోజుల పశ్చిమ బెంగాల్ పర్యటనలో భాగంగా ఆయన శనివారం మాల్డాలో ప్రసంగించారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై కొనసాగుతున్న వివాదం నేపథ్యంలో శరణార్థులకు మోదీ భరోసా ఇచ్చారు. మతపర హింస కారణంగా బంగ్లాదేశ్(Bangladesh) నుంచి భారతదేశానికి వలస వచ్చిన మతువా సమాజానికి భరోసా ఇస్తామని ప్రకటించారు.
"మతపరమైన హింస కారణంగా భారతదేశంలో ఆశ్రయం పొందిన మతువాస్ వంటి శరణార్థులకు నేను భరోసా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని అన్నారు.
‘అక్రమ చొరబాట్లే పెద్ద సమస్యే..’
బెంగాల్ అతిపెద్ద సవాళ్లలో అక్రమ చొరబాటు సమస్య ఒకటని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలు అక్రమ వలసదారులను గుర్తించి బహిష్కరిస్తున్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు మోదీ.
"బెంగాల్‌లో అక్రమ చొరబాట్లే పెద్ద సవాలు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన సంపన్న దేశాలు ఉన్నాయి. వాటికి డబ్బు కొరత లేదు. అయినా చొరబాటుదారులను తిరిగి తమ దేశాలకు పంపిచేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ నుంచి చొరబాటుదారులను తొలగించడం కూడా అంతే అవసరం" అని అన్నారు.
ఇటీవలి హింసాత్మక సంఘటనలను ఈ సమస్యతో ముడిపెడుతూ.. చొరబాట్ల కారణంగా మాల్డా, ముర్షిదాబాద్‌తో సహా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. బెంగాల్‌లో చొరబాటుదారులు స్థిరపడేలా టీఎంసీ "సిండికేట్" వ్యవస్థ పనిచేస్తోందని, దీనివల్ల అనేక ప్రాంతాలలో జనాభాలో మార్పులు వస్తున్నాయని ఆరోపించారు. టీఎంసీ "గూండాయిజం, బెదిరింపు రాజకీయాలు" త్వరలో ఫుల్‌స్టాప్ పడుతుందన్నారు.

