
కోడిపందేలకు సిద్ధమైన మీర్జాపురం
సంక్రాంతి సందర్భంగా ‘వారది’ వారు మీర్జాపురంలో భారీ ఏర్పాట్లతో ఉత్సవ వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌లోని నూజివీడు నియోజకవర్గం పరిధిలోని మీర్జాపురం వద్ద సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపందేలు భారీగా ఏర్పాటు చేశారు. స్థానికులు చెబుతున్న మాటల ప్రకారం ఈ ఏర్పాట్లలో ప్రభుత్వ పెద్దలు కూడా పాలుపంచుకుంటున్నారు. నేషనల్ హైవే హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు వెళ్లే మార్గంలో ఉన్న మీర్జాపురం గ్రామం మూడు రోజుల పాటు ఉత్సవ శోభతో మెరుస్తుంది. కోడిపందేలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా ఇక్కడి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
సంక్రాంతి పండుగ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు ఇక్కడికి చేరుకుంటారు. కోడిపందేలు వేసే వారు, చూసేందుకు వచ్చే ప్రేక్షకులతో మీర్జాపురం ప్రాంతం నిండిపోతుంది. పందేలు వేసుకునే వారు నిర్దిష్ట మొత్తం చెల్లించి పాల్గొనవచ్చు. ఇందుకు సంబంధించి భారీ స్థాయి బరి (రింగ్) ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాల్లో 450కి పైగా అరేనాలు ఏర్పాటవుతుండగా, మీర్జాపురం ఒక్కటే కాకుండా భీమవరం, ఉండి, సీసాలి, అకివీడు, యలమంచిలి, కలగంపూడి, దుగ్గిరాల, మురమల్ల వంటి ప్రాంతాలు కూడా ఇలాంటి ఆటలకు సిద్ధమవుతున్నాయి.
మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో కోడి పందేలు మాత్రమే కాకుండా, జబర్దస్త్ టీమ్ నుంచి ప్రముఖ యాంకర్లు పాల్గొంటున్నారు. వారది వారి ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఈ కార్యక్రమంలో యాంకర్ మృదుల టీమ్ ఎంటర్టైన్ చేయనుంది. ఆటలు, పాటల ద్వారా వినోద కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తాయి. మొత్తం 10 ఎకరాల స్థలంలో ప్రేక్షకుల కోసం గ్యాలరీలు నిర్మించారు. వీఐపీ పాస్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ పాస్‌లు తీసుకున్న వారు ముందు వరుసల్లో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించవచ్చు. కార్లు, ఇతర వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక స్థలం కేటాయించారు.
గత ఏడాది కూడా నూజివీడు ప్రాంతంతో పాటు ఎన్టీఆర్ జిల్లాలోని నున్న వద్ద కోడిపందేలు జరిగాయి. సంక్రాంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు స్థానిక సంస్కృతి, సంప్రదాయాలతో ముడిపడి ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. అయితే, జంతు క్రూరత్వ నివారణ చట్టం ప్రకారం కోడిపందేలు చట్టవిరుద్ధమని, అయినప్పటికీ స్థానికంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా మీర్జాపురం ప్రాంతం ఉత్సవ వాతావరణంతో కళకళలాడుతోంది.

