‘ఇలా అయితే చదువులు సాగేదెలా? ’
x

‘ఇలా అయితే చదువులు సాగేదెలా? ’

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను సకాలంలో అందించలేక పోవడంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ ఎక్స్ వేదికగా స్పందించారు.


విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 20 రోజులు గడిచిపోయింది. టీచర్లు పాఠాలు చెప్పడం మొదలుపెట్టారు. కాని 6వ తరగతి విద్యార్థులకు కొన్ని పాఠ్య పుస్తకాలు అందలేదు. ఈ జాప్యంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, విద్యా మంత్రిత్వ శాఖ తీరును తప్పుబట్టారు.

"ఇప్పటికే అసమర్థ నేషనల్ టెస్టింగ్ అథారిటీ (NTA) ద్వారా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు. ఇప్పుడు మా పిల్లల చదువూ నాశనం చేస్తున్నారు" అని ఎక్స్‌లో పేర్కొన్నారు.

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ న్యూఢిల్లీలో కొత్త పాఠ్య ప్రణాళికకు సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత జైరాం రమేష్ స్పందించారు.

ఆలస్యానికి కారణమేంటి?

ఈ సంవత్సరం 3, 6 తరగతులకు మాత్రమే జాతీయ విద్యా ప్రణాళిక (NCF) 2023 ఆధారంగా కొత్త పాఠ్యపుస్తకాలను ముద్రించాలని NCERT నిర్ణయించింది. ఇప్పటికే 3వ తరగతి పాఠ్యపుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉండగా.. 6వ తరగతికి సంబంధించిన కొత్త ఇంగ్లీష్, హిందీ పాఠ్యపుస్తకాలను మాత్రమే విడుదల చేసింది. సైన్స్, గణితం, సాంఘిక శాస్రం పాఠ్యపుస్తకాలు విద్యార్థులకు అందాల్సి ఉంది. కాగా విద్యా మంత్రిత్వ శాఖ (MOE) సీనియర్ అధికారి ఒకరు ఇలా అన్నారు.

‘‘పాఠ్యపుస్తకాల ముద్రణ పనులు చివరి దశలో ఉన్నాయి. 3, 6 తరగతులకు సంబంధించి తొమ్మిది పాఠ్యపుస్తకాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. మిగిలిన ఎనిమిది పుస్తకాలను వీలైనంత తర్వలో మార్కెట్లో ఉంచుతాం’’ అని పేర్కొన్నారు.

ముద్రణ పూర్తయి, విద్యార్థులకు చెంతకు చేరేందుకు ఇంకా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉందని సమాచారం. సకాలంలో పుస్తకాలు అందకపోవడంపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read More
Next Story