
ఏపీ పర్యాటక రంగం ప్రతిపాదనలతో ఢిల్లీకి మంత్రి
మంత్రి కందుల దుర్గేష్ ఢిల్లీ పర్యటనలో రూ.915 కోట్ల 9 కొత్త ప్రతిపాదనలు
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం వేళ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. రాష్ట్రంలోని ఐకానిక్ పర్యాటక కేంద్రాలు, ఆధ్యాత్మిక సర్క్యూట్‌ల అభివృద్ధికి మొత్తం రూ.915 కోట్ల విలువైన 9 కొత్త ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించనున్నారు.
గతంలో రూ.430 కోట్లు కేంద్ర నిధులు
గతంలో మంత్రి కందుల దుర్గేష్ చేసిన నిరంతర ప్రయత్నాల వల్ల శాస్కి, ప్రసాద్, స్వదేశ్ దర్శన్, సిబిడిడి వంటి కేంద్ర పథకాల కింద ఇప్పటికే 8 పర్యాటక ప్రాజెక్టులకు రూ.430 కోట్లు మంజూరు అయ్యాయి. బొర్రా గుహలు, సూర్యలంక, నాగార్జున సాగర్, అహోబిలం, అన్నవరం, సింహాచలం వంటి ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుల పురోగతి, నిధుల విడుదలను వేగవంతం చేయాలని కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి దుర్గేష్ వివరించనున్నారు. ఆయన ఢిల్లీలో గురువారం కేంద్ర మంత్రిని కలుస్తారు. గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో కేవలం ఒక ప్రాజెక్టుకు మాత్రమే నిధులు వచ్చాయని, ఇప్పుడు పర్యాటక రంగానికి ‘పారిశ్రామిక హోదా’ కల్పించి వేగం పెంచిన విషయం కూడా ప్రస్తావించనున్నారు.
నూతన ప్రతిపాదనలు – రూ.915 కోట్ల ప్యాకేజీ
నూతన ఆర్థిక సంవత్సరంలో ఏపీ పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వాలనే లక్ష్యంతో డీపీఆర్‌లు సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించనున్న 9 ప్రధాన ప్రతిపాదనలు ఇవి.
మచిలీపట్నం వైబ్రెంట్ బీచ్ ఫ్రంట్ డెవలప్‌మెంట్: స్వదేశ్ దర్శన్ 2.0 కింద రూ.120.04 కోట్లు.
మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం: ప్రసాద్ స్కీమ్ కింద రూ.95.18 కోట్లు.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం: రూ.213.72 కోట్లు.
ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ గృహ మల్లేశ్వర స్వామి ఆలయం: రూ.48.95 కోట్లు.
కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం: రూ.36 కోట్లు.
వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానాలు: రూ.120 కోట్లు.
లేపాక్షి పర్యాటక సౌకర్యాలు & సాంస్కృతిక మౌలిక సదుపాయాలు: రూ.103.05 కోట్లు.
లంబసింగి పర్యాటక అభివృద్ధి: రూ.99.87 కోట్లు.
ప్రధాన బౌద్ధ క్షేత్రాల వద్ద టెంట్ సిటీలు: రూ.77.32 కోట్లు.
అదనంగా తిరుపతి, విశాఖపట్నంను దేశంలోని 50 ప్రపంచ స్థాయి పోటీ పర్యాటక కేంద్రాల్లో చేర్చాలని, సీఎం చంద్రబాబు రాసిన లేఖను ప్రస్తావిస్తూ విజ్ఞప్తి చేయనున్నారు. అమరావతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ (NIH), రూ.100 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఎక్స్‌పీరియన్స్ & ఇన్‌ఫర్మేషన్ సెంటర్ (పర్యాటక భవన్) ఏర్పాటుకు కూడా మద్దతు కోరనున్నారు.
కీలక ప్రతిపాదనలు
‘సూర్యరాయాంధ్ర నిఘంటువు’ (1936-74 మధ్య 8 సంపుటాలు) ఆధునిక సాంకేతికతతో పునర్ముద్రణ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచన.
రాజమండ్రిలో నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా (NSD) ఏర్పాటు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) బ్రాంచ్.
విశాఖపట్నంలో లలిత కళా అకాడమీ ప్రాంతీయ కేంద్రం.
విజయవాడ ఘంటసాల సంగీత కళాశాలలో ‘కళాక్షేత్ర’ ఆడిటోరియం.
సాహిత్య అకాడమీ ప్రాంతీయ కేంద్రం.
ఈ 6 సాంస్కృతిక ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోసం కూడా కేంద్ర మంత్రిని అభ్యర్థించనున్నారు.
ఏపీ పర్యాటక రంగం దారెటు?
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ‘గ్రోత్ ఇంజిన్’గా మారింది. పర్యాటక పాలసీ 2024-29 ద్వారా పారిశ్రామిక హోదా, రూ.17,973 కోట్ల పెట్టుబడులు, 1.22 లక్షల ఉద్యోగాలు లక్ష్యం. విశాఖ, అమరావతి, తిరుపతి మూడు నగరాలను గ్లోబల్ టూరిజం హబ్‌లుగా తీర్చిదిద్దడం పైన సీఎం దృష్టి. మౌలిక సదుపాయాలు, రవాణా, హోమ్‌స్టేలు, థీమ్ పార్కులు అన్నీ వేగంగా అమలవుతున్నాయి.
మంత్రి దుర్గేష్ ఆశాభావం
“ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మేము కట్టుబడి ఉన్నాం. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో రాష్ట్ర పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతోంది” అని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఢిల్లీ పర్యటన ఏపీ పర్యాటక రంగానికి ‘అనుకూల పవనాలు’ తీసుకువస్తుందని, మరిన్ని ప్రాజెక్టులు మంజూరైతే ఉపాధి, ఆర్థికాభివృద్ధి కొత్త ఎత్తులు తాకుతాయని ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి.

