
పాల విషాదం: రూ. 10 లక్షల పరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఈ విషాదంలో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారని సీఎం తెలిపారు.
రాజమహేంద్రవరంలోని లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో కల్తీ పాల కారణంగా సంభవించిన మరణాలు, అస్వస్థతపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనను అత్యంత దురదృష్టకరమైనదిగా అభివర్ణించిన ఆయన, మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున భారీ ఆర్థిక సాయాన్ని ప్రకటించి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
అసెంబ్లీలో సీఎం వివరణ
ముఖ్యమంత్రి తన ప్రకటనలో లాలాచెరువు ఘటనకు సంబంధించి కీలక గణాంకాలను వెల్లడించారు. ఈ విషాదంలో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోయారని, మరో ఎనిమిది మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వరలక్ష్మి డెయిరీకి చెందిన కల్తీ పాల వల్లే ఈ అస్వస్థత తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయిందని, బాధ్యులపై సెక్షన్ 194 కింద కఠిన కేసులు నమోదు చేశామని సభకు వివరించారు.
యుద్ధప్రతిపాదికన రంగంలోకి జిల్లా యంత్రాంగం
మరోవైపు రాజమహేంద్రవరంలో కలెక్టర్ కీర్తి చేకూరి, ఎస్పీ నరసింహ కిషోర్ సంయుక్తంగా పరిస్థితిని సమీక్షించారు. కిడ్నీ సంబంధిత (Acute Renal Failure) కేసులు నమోదైన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైందని కలెక్టర్ తెలిపారు. వైద్య ఆరోగ్య, ఆహార భద్రత, పోలీసు, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, ప్రభావిత ప్రాంతాల్లో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
ఒకే వ్యాపారి.. 106 కుటుంబాలు
ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న పాల వ్యాపారిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యాపారి మొత్తం 106 ఇళ్లకు పాలు సరఫరా చేసినట్లు గుర్తించారు. ఇప్పటివరకు 12 మంది డయాలసిస్ అవసరమైన స్థితిలో ఆస్పత్రుల్లో చేరగా, ముందస్తు జాగ్రత్తగా పాలు వినియోగించిన మిగిలిన 73 కుటుంబాల నుంచి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. నిరంతర పర్యవేక్షణ కోసం ప్రత్యేక ప్రతిస్పందన బృందాలను రంగంలోకి దించారు.
ప్రయోగశాల నివేదికలపై నిఘా
ఆహార భద్రత అధికారులు సేకరించిన పాలు, పెరుగు నమూనాలను హైదరాబాద్, విశాఖపట్నంలోని ప్రయోగశాలలకు పంపారు. అలాగే పశుసంవర్థక శాఖ ద్వారా 46 పశువులకు పరీక్షలు నిర్వహించి నమూనాలను పశుసంవర్థక ప్రయోగశాలలకు పంపినట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ నివేదికలు అందిన వెంటనే కల్తీకి గల అసలు కారణాలు తెలుస్తాయని, ఆ తర్వాత నిందితులపై మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు.
ప్రజలకు విజ్ఞప్తి .. హెల్ప్‌లైన్ ఏర్పాటు
ప్రజలు భయాందోళన చెందవద్దని, అనుమానాస్పద లక్షణాలు (వాంతులు, మూత్ర విసర్జన తగ్గడం) కనిపిస్తే వెంటనే హెల్ప్‌లైన్ నెంబర్ 9494060060 ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు. ప్రజలు కొన్ని రోజుల పాటు పాలను బాగా మరిగించిన తర్వాతే వినియోగించాలని ఎస్పీ కిషోర్ విజ్ఞప్తి చేశారు. మృతులు ఎన్. శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి, తాడి కృష్ణవేణి, తాడి రమణి కుటుంబాలకు పోస్టుమార్టం నివేదికల అనంతరం తదుపరి ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
Next Story

