
రాజమండ్రి కల్తీ పాల బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
రాజమండ్రిలో పాలు.. సిక్కోలులో నీళ్లు.. కల్లోలం!
కలుషిత పాలు, నీళ్లు ప్రజల ప్రాణాలు తోడేస్తున్నాయి. రాజమండ్రి, శ్రీకాకుళంల్లో పది మందిని మింగేశాయి.
సాధారణంగా పాలకూ, నీళ్లకూ అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకే పాలూ నీళ్లులా కలిసిపోయారని అంటుంటారు. కానీ ఇప్పుడు ఆ రెండూ కలుషితమై కాలకూట విషాలుగా మారుతున్నాయి. ప్రాణాలు నిలపాల్సిన పాలు, నీళ్లే ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో యాధృచ్ఛికంగా ఇవి ఒకేసారి కాలుష్య కారకాలుగా మారి మరణ మృదంగాలను మోగిస్తున్నాయి. జనంలో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో కలుషిత పాలు తాగి ఆరుగురు, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కలుషిత నీరు తాగి నలుగురు మృత్యువాత పడడం సర్వత్రా అలజడి రేపుతోంది.
రాజమండ్రి కల్తీ పాల బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులు
రాజమండ్రిలో ‘పాల’కూట విషానికి ఆరుగురు బలి..
కొద్దిరోజుల క్రితం రాజమండ్రి లాలాచెరువు ప్రాంతంలోని చౌడేశ్వరనగర్, స్వరూప్‌నగర్ ప్రాంతాల్లో పలువురు వ్యక్తులు కల్తీ పాలు తాగి అస్వస్థకు గురైన సంగతి తెలిసిందే. ఈ పాలను అడ్డాల గణేష్ అనే పాల వ్యాపారి సరఫరా చేస్తున్నాడు. కల్తీ చేసిన పాలను ఈయన సప్లై చేయడంతో వాటిని తాగిన వారిలో కిడ్నీలు ఫెయిలై ఇప్పటివరకు ఆరుగురు మృత్యువాతపడ్డారు. 21 మంది రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితుల రక్తంలో యూరియా, సీరమ్ క్రియాటినిన్ స్థాయిలు అధికంగా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అంటే విషపూరిత పాలు తాగడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని వీరు నిర్ధారణకు వచ్చారు.
శ్రీకాకుళం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు
మున్ముందు కూడా ప్రభావం చూపుతుందా?
ఇప్పటì వరకు కలుషిత పాలు తాగిన వారిలో ఆరుగురు మరణించారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరు కోలుకుంటున్నారు. గణేష్ సరఫరా చేస్తున్న పాలు తాగుతున్న వారిలో ప్రస్తుతం కొందరు ఆరోగ్యంగా ఉన్నా భవిష్యత్తులో అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అందువల్ల ఇప్పట్నుంచే మిగిలిన వారు వైద్య పరీక్షలు చేయించుకోవాలని వీరు సూచిస్తున్నారు.
శ్రీకాకుళం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు
పాలలో కల్తీనా? ఫ్రిడ్జ్‌లో ఇథలీన్ గ్లైకాల్ లీకా?
రాజమండ్రి ఘటనకు పాలలో కల్తీ జరిగిందా? లేక రోజుల తరబడి పాలను కూలింగ్ ఫ్రిడ్జ్‌లో ఉంచడం వల్లేనా? అన్న దానిపై ఇంకా స్పష్టత లేదు. తొలుత ఈ పాలు కల్తీ అయిందని భావించినా తాజాగా పాలను సరఫరా చేస్తున్న గణేష్ పాలను కూలింగ్ మిషన్‌లో రోజుల కొద్దీ ఉంచడం, అది మరమ్మతులకు గురై అందులో ఉంచిన పాలు గడ్డకట్టడానికి ఇథలీన్ గ్లైకాల్ లీకై పాలను కలుషితం చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్న మాట! అయితే ఈ రెండింటిలో ఏది నిజమో మరో రెండు మూడు రోజుల్లో రానున్న నివేదికలు తేటతెల్లం చేయనున్నాయి.
శ్రీకాకుళంలో కాటేసిన కలుషిత నీరు..
మరోవైపు శ్రీకాకుళం నగరంలో కలుషిత నీరు తాగి నాలుగు రోజుల వ్యవధిలో నలుగురు మృత్యువాత పడ్డారు. డయేరియాతో మరో 80 మందికి పైగా తీవ్ర అస్వస్థతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరు పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉన్న వీరికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మరణించిన వారిలో దమ్ములవీధికి చెందిన మడ్డు లక్ష్మణ (61), మండల సురేష్ (41), మోణింగి సంతోష్ (41), సదాశివుని నర్సింగరావు (62)లు ఉన్నారు.
మంచినీరెలా కలుషితమైందంటే?
శ్రీకాకుళం మెయిన్‌రోడ్డులో కాలువలను పున ర్‌నిర్మిస్తుండడంతో మురుగు నీరు పైప్‌లైన్‌లోకి చేరి కలుషితమైందని ప్రా«థమికంగా అంచనాకు వచ్చారు. ఆ నీటిని తాగిన వారు డయేరియా బారిన పడినట్టు భావిస్తున్నారు. ముఖ్యంగా కార్పొరేషన్ కార్యాలయం సర్వీసు ట్యాంకు నుంచి ఏఏ ప్రాంతాలకు కుళాయిల ద్వారా నీరు సరఫరా అవుతుందో ఆ ప్రాంతాల వేరే ఎక్కువగా డయేరియా బారిన పడ్డారు. అంటే నగరంలోని దాదాపు సగం ప్రాంతాల్లో అతిసార ప్రభావం కనిపిస్తోంది. దమ్ములవీధి, మేదరవీధి, కాకివీధి, గుడివీధి, మంగువారితోట, గోల్కొండ రేవు, మొండేటి వీధి, వాంబే కాలనీ, అరసవల్లి, హౌసింగ్ బోర్డు కాలనీ తదితర ప్రాంతాల్లో డయేరియా కేసులు నమోదయ్యాయి. దీంతో శ్రీకాకుళం రిమ్స్, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు జెమ్స్, కిమ్స్, మెడికవర్, సింధూర, అప్సర ఆస్పత్రులు బాధితులతో కిటకిటలాడుతున్నాయి. మరికొందరు ఇంటి వద్దే చికిత్స పొందుతున్నారు. తాజాగా మరికొన్ని ప్రాంతాల్లో డయేరియా కేసులు వెలుగు చూస్తుండడం నగర వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
నీరు కలుషితానికి బాధ్యులెవరు?
శ్రీకాకుళం నగరంలో తాగు నీరు కలుషితానికి బాధ్యులెవరు? అన్న దానిపై చర్చ నడుస్తోంది. కాలువల పునర్నిర్మాణంలో సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రజలకు సరఫరా అవుతున్న కుళాయి నీళ్లు డ్రెయినేజీ పైప్‌లైన్‌లో కలిసిపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. వారు ఆ జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే మంచినీరు, మురుగు నీరు కలుషితమై నలుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ ఘటనకు సంబంధిత అధికారులను కాకుండా మున్సిపల్ కమిషనర్ కూర్మారావును ప్రభుత్వం బుధవారం సస్పెండ్ చేసింది. కొద్దిరోజుల క్రితమే కమిషనర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో ఆయన్ను బాధ్యులను చేయడం విస్మయం వ్యక్తమవుతోంది.
పరిహారంపై ప్రభుత్వం పదనిసలు..
శ్రీకాకుళంలో అతిసారతో నలుగురు చనిపోయారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఒక్కరు మాత్రమే మరణించినట్టు చెబుతోంది. మరణించిన ఆ వ్యక్తికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రకటించింది. మిగిలిన వారి విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. మరోవైపు రాజమండ్రి కల్తీ పాల ఘటనలో మృత్యువాత పడిన ఆరుగురికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ సమీక్ష..
శ్రీకాకుళం డయేరియా ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. ఫోన్లో ఆ జిల్లా అధికారులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ కూడా బుధవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా మంచినీరు సరఫరా చేయాలని, అదనపు సిబ్బందితో పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు.
Next Story

