
మీరట్‌లో అగ్ని ప్రమాదం: 11 మంది మృతి
షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు సహా మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కిద్వాయి నగర్ ప్రాంతంలోని లిసాడి గేట్‌లో ఈ ఘటన సోమవారం జరిగింది. ఇక్బాల్ అహ్మద్ నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగినట్లు సమాచారం అందడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఇంట్లో పెద్ద మొత్తంలో బట్టలు నిల్వ ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో మంటలు వేగంగా వ్యాపించాయి. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. విచారణ కొనసాగుతోంది. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే 11 మందిని మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుల్లో రుఖ్సార్ (25), మహ్‌బిష్ (12), హమ్మాద్ (4), అకదాస్ (4), నబియా (4 నెలలు), ఇనాయత్ (4 నెలలు) ఉన్నారు. గాయపడిన అమీర్ బానో (55) చికిత్స పొందుతున్నారు. వేసవిలో షార్ట్ సర్క్యూట్‌ల కారణంగా అగ్ని ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

