న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంది కీలక పాత్ర: జస్టిస్ సూర్యకాంత్
x

న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వంది కీలక పాత్ర: జస్టిస్ సూర్యకాంత్

అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు కోరారు.


న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం (Mediation) అత్యంత కీలకమని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ప్రతి చిన్న సమస్యకు కోర్టులకు రావడం కంటే, మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల కేసులు సులువుగా, త్వరగా ముగుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మధ్యవర్తిత్వంపై విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన కీలక ప్రసంగం చేశారు. ముఖ్యంగా పెరుగుతున్న కుటుంబ తగాదాల వల్ల కోర్టులపై భారం పెరుగుతోందని, ఇరుపక్షాలకు నమ్మకం కలిగేలా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మలేషియా వంటి దేశాల్లో ఉన్న ఉత్తమ విధానాలను మన దేశంలోనూ ప్రతి స్థాయిలోనూ అమలు చేయాలని ఆయన సూచించారు.


అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీ : సీఎం

ఈ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజధాని అమరావతిలో నేషనల్ జ్యుడిషియల్ అకాడమీని ఏర్పాటు చేయాలని సీజేఐని కోరారు. అమరావతిలోని జస్టిస్ సిటీని దేశంలోనే అత్యుత్తమ మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన వివరించారు. జ్యుడిషియల్ అకాడమీ, లీగల్ సర్వీసెస్ అథారిటీ, మీడియేషన్ సెంటర్ , ఇంటర్నేషనల్ లా యూనివర్శిటీ వంటి సంస్థలను ఒకే చోట అనుసంధానిస్తూ అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు.

మధ్యవర్తిత్వానికి ప్రోత్సాహకాలు
గ్రామీణ స్థాయిలో సమస్యల పరిష్కారానికి గతంలో ఉన్న పెద్దరికం వ్యవస్థను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. మధ్యవర్తిత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు వినూత్నంగా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసు పరిష్కారమైతే రూ. 10,000, ఒకవేళ పరిష్కారం కాకపోయినా చేసిన ప్రయత్నానికి గానూ రూ. 3,000 అందజేస్తామని తెలిపారు. సత్వర న్యాయం అందితేనే సమాజంలో త్వరితగతిన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధి - వికసిత్ భారత్ లక్ష్యం
అమరావతిని పర్యావరణ హితంగా, ఆర్థికంగా బలమైన బ్లూ-గ్రీన్ ఫీల్డ్ రాజధానిగా నిర్మిస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు. 29,000 మందికి పైగా రైతులు స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చి రాజధాని నిర్మాణంలో భాగస్వాములయ్యారని తెలిపారు. ’వికసిత్ భారత్ - 2047' లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని, దీనికి న్యాయ వ్యవస్థ సహకారం కావాలని ఆయన కోరారు.
Read More
Next Story