మేయర్ వర్సెస్ కలెక్టర్
x
మేయర్ పీలా శ్రీనివాసరావుని రిక్వెస్ట్ చేస్తున్నజిల్లా కలెక్టర్ హరేందిర ప్రసాద్

మేయర్ వర్సెస్ కలెక్టర్

విశాఖ ఉత్సవ్‌లో ప్రొటోకాల్ సెగలు. మంత్రుల ముందే రచ్చరచ్చ.


సరదాగా సాగిపోవాల్సిన ’విశాఖ ఉత్సవ్‘ ప్రారంభోత్సవ వేదిక ఒక్కసారిగా రాజకీయ రణరంగంగా మారింది. నగర ప్రథమ పౌరుడైన మేయర్ పీలా శ్రీనివాసరావు, జిల్లా మేజిస్ట్రేట్ అయిన కలెక్టర్ హరేందిర ప్రసాద్ మధ్య తలెత్తిన ప్రొటోకాల్ వివాదం పెను దుమారానికి దారితీసింది. మంత్రుల సమక్షంలోనే మేయర్ కలెక్టర్‌పై వేలు చూపిస్తూ హెచ్చరించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అసలేం జరిగింది?

శనివారం రాత్రి ఉత్సవ్ ప్రారంభ వేడుకల్లో భాగంగా వేదికపై ఆసీనులయ్యే క్రమంలో ఈ వివాదం మొదలైంది. సీట్ల అమరిక విషయంలో కలెక్టర్ హరేందిర ప్రసాద్.. మేయర్ శ్రీనివాసరావును ఉద్దేశించి కాస్త పక్కకు కూర్చోగలరు అని అనడమే అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ఈ మాటతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన మేయర్, వేదికపైనే శివాలెత్తిపోయారు.

వేలు చూపిస్తూ వార్నింగ్.. చేతులు నెట్టేసి వీరంగం

నేను నగర ప్రథమ పౌరుడిని. నన్ను లేచి పక్కకు వెళ్ళమంటావా? అసలు నీకు ప్రొటోకాల్ తెలుసా? అంటూ మేయర్ కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. కలెక్టర్ నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ మేయర్ చేతులపై చేయి వేయగా.. ఆయన దానిని బలంగా నెట్టేసి వేలు చూపిస్తూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. హోంమంత్రి అనిత, మంత్రులు కందుల దుర్గేష్, వీరాంజనేయస్వామి చూస్తుండగానే ఈ వాగ్వాదం జరగడం గమనార్హం.

నిశ్చేష్టుడైన కలెక్టర్.. మంత్రుల మౌనం

కలెక్టర్ ఎంత బతిమిలాడినా మేయర్ శాంతించలేదు. ఏం మాట్లాడుతున్నావయ్యా.. తమాషాగా ఉందా? అంటూ అక్కడి నుంచి విసురుగా వెళ్లిపోయారు. జిల్లా మేజిస్ట్రేట్ హోదాలో ఉన్న కలెక్టర్‌కు మంత్రుల నుంచి కనీస మద్దతు లభించకపోవడం, వారు మేయర్‌ను వారించకపోవడంతో కలెక్టర్ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. వేదిక దిగి వెళ్ళిపోయిన కలెక్టర్ కొద్దిసేపు తన కారులోనే మౌనంగా కూర్చుండిపోవడం అక్కడ ఉన్న వారందరినీ విస్మయానికి గురిచేసింది.

వైరల్ వీడియో.. విమర్శల వెల్లువ

ఈ వివాదానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. ఒక ఐఏఎస్ అధికారి పట్ల మేయర్ ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ఉండాల్సిన సమన్వయం లోపించిందని, బహిరంగ వేదికపై ఇలాంటి ఘటనలు జరగడం నగర ప్రతిష్టకు భంగకరమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More
Next Story