
వెస్ట్ బెంగాల్: ముర్షిదాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
జాతీయ రహదారిని దిగ్బంధించిన బెల్దంగా గ్రామస్థులు, టైర్లకు నిప్పటించి ఆందోళన..సీఎం మమత హామీ..
పశ్చిమ బెంగాల్(West Bengal)లోని ముర్షిదాబాద్ జిల్లా నిరసనలతో అట్టుడుకుతోంది. శుక్రవారం (జనవరి 16) పొరుగు రాష్ట్రమైన జార్ఖండ్(Jharkhand)లో స్థానిక వలస కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందడంతో ముర్షిదాబాద్ జిల్లాలోని బెల్దంగాలో నిరసనలు వెల్లువెత్తాయి. బెల్దంగాలోని సుజాపూర్-కుమార్‌పూర్ ప్రాంతవాసి అయిన 37 ఏళ్ల అలావుద్దీన్ షేక్.. జార్ఖండ్‌లో హాకర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం (జనవరి 15) ఉదయం అలావుద్దీన్ షేక్ తాను ఉంటున్న హాస్టల్ గదిలో ఉరివేసుకుని కనిపించాడు. అయితే అలావుద్దీన్‌ను కొట్టి చంపి, ఆత్మహత్య చిత్రీకరించారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైవే దిగ్బంధం..
అలావుద్దీన్ మరణ వార్త తెలియగానే బెల్దంగా వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి-12ని దిగ్బందించారు. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. టైర్లకు నిప్పంటించి బెల్దంగా రైల్వే స్టేషన్ వద్ద నిరసన తెలపడంతో సీల్దా (కోల్‌కతా)-లాల్గోలా (ముర్షిదాబాద్) మార్గంలో రైలు సేవలకు అంతరాయం ఏర్పండింది.
‘నిందితులను కఠినంగా శిక్షించాలి’
బెంగాలీ మాట్లాడే వలసదారులపై జార్ఖండ్ రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయని నిరసనకారులు ఆందోళన వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారులుగా ముద్రవేసి చంపేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కొట్టి చంపారు’
"ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదు. అలావుద్దీన్ షేక్ బెంగాల్‌కు చెందిన కార్మికుడు కాబట్టి అతన్ని లక్ష్యంగా చేసుకున్నారు. నేరస్థులను వెంటనే అరెస్టు చేసి, కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నాం.’’ అని ఒక నిరసనకారుడు మీడియాతో అన్నారు.
అల్లావుద్దీన్ చివరి మాటలు..
అల్లావుద్దీన్ తన కుటుంబంతో చివరిసారిగా బుధవారం (జనవరి 14) మధ్యాహ్నం మాట్లాడాడు. "నేను గది నుంచి బయటకు రాలేను. ఇక్కడ చాలా భయంగా ఉంది. అవకాశం దొరికితే వెంటనే ఇంటికి తిరిగి వస్తాను’’ అని నాతో మాట్లాడాడు అని అల్లావుద్దీన్ తల్లి సోనా బీబీ తెలిపారు.
‘నేరస్థులను కఠినంగా శిక్షించాలి’
ఐడీ కార్డులో ముర్షిదాబాద్ చిరునామా ఉండడంతో అల్లావుద్దీన్‌ను కొట్టి చంపారు. ముర్షిదాబాద్ నుంచి వచ్చిన కార్మికులు పని కోసం వేరే చోటికి వెళ్ళినప్పుడు వారిపై ఎందుకు దాడి చేస్తారు? జార్ఖండ్ కూడా భారతదేశంలో భాగమే కదా. నేరస్థులకు మరణశిక్ష విధించాలి. ఇలాంటి ఘటనలు ఇకముందు జరగమని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాకు హామీ ఇవ్వాలి. అప్పటి వరకు మేము వెనక్కి తగ్గం’’ అని బెల్దంగావాసి ఒకరు డిమాండ్ చేశారు.
గ్రామానికి వెళ్లిన కాంగ్రెస్ నేత..
మాజీ ఎంపీ, కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి బెల్దండా గ్రామాన్ని సందర్శించారు. జీవనోపాధి కోసం ఇతర రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ వాసులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అరెస్టులు జరిగి న్యాయం జరిగే వరకు తమ నిరసనలను కొనసాగిస్తామని గ్రామస్తులు ప్రతిజ్ఞ చేశారు. ఇటు బీజేపీ నాయకుడు, రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ పోలీసులు ప్రదర్శనకారులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
సీఎం హామీ..
వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో బీహార్‌లో జరిగిన కొన్ని దారులను ఈ సందర్భంగా ఆమె గుర్తుచేశారు. దాడులను ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
నిరసనకారులు ఆందోళన విరమించేందుకు జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. ఆందోళన కారులతో ఉన్నతాధికారులు చర్చిస్తున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నిరసనకారులు శాంతించలేదు.
మీడియాపై దాడి..
నిరసనను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులు కూడా దాడికి గురయ్యారు. ఒక మహిళా టెలివిజన్ రిపోర్టర్ గాయపడ్డారు.

