
యుద్ధం వచ్చినా తగ్గేదేలే అంటున్న తిరుమల భక్తులు!
సామాన్య భక్తుడి దైవచింతన ముందు యుద్ధాలు, ఆర్ధిక ఒత్తిళ్లు వంటేవేవీ అడ్డుకావని తిరుమల రద్దీ నిరూపిస్తోంది.
యుద్ధ మేఘాలు కమ్ముకున్నా, ఆర్థిక ఒత్తిళ్లు పెరుగుతున్నా... సామాన్య భక్తుడి దైవచింతన ముందు ఇవేవీ అడ్డుకావని తిరుమల రద్దీ నిరూపిస్తోంది.
ఇరాన్- అమెరికా దేశాల మధ్య యుద్ధ వాతావరణంతో మనకీ పెట్రోల్ ధరల సెగ తగిలింది. గ్యాస్ ధరలు పెరిగి హోటళ్లు మూతపడుతున్నాయి. ఆర్థిక అనిశ్చితి అంటున్నారు. స్టాక్ మార్కెట్లు ఢమాల్ మంటున్నాయి... అయితే ఇవేవీ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులను ఆపలేకపోతున్నాయి. "యుద్ధంతో రవాణా ఇబ్బందులు రావచ్చు, పెట్రోల్ ఆదా చేయండి" అని పాలకులు మొత్తుకుంటున్నా, భక్తులు మాత్రం 'తగ్గేదేలే' అన్నట్లుగా తిరుమలకు క్యూ కడుతున్నారు. శనివారం అలిపిరిలో వాహనాల తాకిడే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.
యుద్ధ ప్రభావంతో పెట్రోల్ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని, వీలైనంత వరకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని సాక్షాత్తు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసినా.. భక్తులు మాత్రం తమ సొంత వాహనాల్లోనే అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద బారులు తీరారు. వారాంతపు సెలవులు తోడవడంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. వాహనాల రద్దీని నియంత్రించడం అధికారులకు సవాలుగా మారింది.
వచ్చే వారం శ్రీవారి ఆలయంలో కీలక ఘట్టాలు జరగనున్నాయి. మార్చి 19న ఉగాది ఆస్థానం సందర్భంగా, దానికి ముందు వచ్చే మంగళవారం (మార్చి 17) కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. శుద్ధి కార్యక్రమం కారణంగా మార్చి 17న వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవలను టీటీడీ రద్దు చేసింది.
మార్చి 16న ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా ఇతరుల నుంచి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదు.
భక్తుల రద్దీ.. గంటల తరబడి నిరీక్షణ..
ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కేవలం నిన్న ఒక్క రోజే 68,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోవడం విశేషం. హుండీ ద్వారా ఒక్క రోజే 3.68 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.
టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి ఏకంగా 18 నుంచి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ దాటి కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లు సాగాయి.
క్యూలైన్లలో అసహనం.. సోషల్ మీడియాలో వైరల్
తీవ్రమైన రద్దీ, వెయిటింగ్ కారణంగా కొందరు భక్తులలో అసహనం వ్యక్తమవుతోంది. నారాయణగిరి షెడ్లలో ఒక భక్తుడు టీటీడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తోటి భక్తులను ప్రేరేపించడం, ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒకవైపు యుద్ధ భయం, మరోవైపు భక్తి పారవశ్యం. సామాన్యుడికి కష్టకాలంలో దేవుడే కొండంత అండ అనే నమ్మకం ఈ రద్దీ ద్వారా స్పష్టమవుతోంది. అయితే, పెట్రోల్ ఆదా వంటి ప్రభుత్వ సూచనలను పాటించడం కూడా పౌరుల బాధ్యత అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Next Story

