
ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర
టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల ఇంటికే కన్నం వేసిన దొంగలు
సంచలనం సృష్టించిన ఈ ఘటన నరేంద్ర స్వగ్రామం చింతలపూడిలో జరిగింది.
గుంటూరు జిల్లా దొంగలు అధికార టీడీపీ పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకే సవాల్ విసిరారా? ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ప్రమీలాదేవి నివాసంలో భారీ చోరీ జరిగింది.
నరేంద్ర స్వగ్రామం చింతలపూడి. ఆయనకున్న పూర్వీకుల ఇంట్లో ఆయన తల్లి ప్రమీలాదేవి ఉంటున్నారు. ఆ ఇంట్లోకి గుర్తుతెలియని దుండగులు చొరబడి విలువైన నగలను దోచుకెళ్లారు. వీటి విలువ సుమారు 35 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా. దొంగలు 43 సవర్ల బంగారం, 10 కేజీల వెండి, రూ. 1 లక్ష నగదు, ఇతరత్రా విలువైన వస్తువులను దోచుకుపోయారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ప్రాంతంలో కలకలం రేగింది.
పోలీసుల హడావిడి..
ప్రమీలాదేవి ఫిర్యాదు మేరకు పొన్నూరు గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ జరిగిన ఇంటిని క్లూస్ టీమ్ పరిశీలించింది. వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించినట్లు సమాచారం. ప్రమీలాదేవి గుంటూరులోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లిన అదును చూసి దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు ఎస్సై శ్రీహరి తెలిపారు. దుండగుల ఆచూకీ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిసింది.
ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఇంటిలోనే ఇంత పెద్ద చోరీ జరగడం స్థానికంగా భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి గస్తీ, సీసీటీవీ పర్యవేక్షణ అవసరంపై చర్చ మొదలైంది.
Next Story

