పరారీలో ఫైర్ వర్క్స్ యజమాని, 23కి చేరిన మృతుల సంఖ్య
x
కాలిబూడిదైన సూర్యవంశీ ఫైర్ వర్క్స్

పరారీలో ఫైర్ వర్క్స్ యజమాని, 23కి చేరిన మృతుల సంఖ్య

ఆవేళ వాకతిప్ప, ఇవాళ వేట్లపాలెం.. ఆగని మృత్యుఘోష


కాకినాడ జిల్లాలో శనివారం మధ్యాహ్నం సంభవించిన బాణసంచా పేలుడు ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. సామర్లకోట మండలం వేట్లపాలెం సమీపంలోని 'సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్' తయారీ కేంద్రం ఒక్కసారిగా నిప్పుల కొలిమిగా మారింది. ఈ ఘోర ప్రమాదంలో ఇప్పటివరకు 23 మంది కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి మృతదేహాలు తునకలై పక్కనే ఉన్న పంట చేలల్లోకి ఎగిరిపడటం అక్కడి భీభత్సానికి అద్దం పడుతోంది.
అసలేం జరిగింది?
పొలాల మధ్య ఆరు షెడ్లలో బాణసంచా తయారీ సాగుతుండగా, మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఒక్కసారిగా మందుగుండు నిల్వలు పేలాయి. ప్రమాద సమయంలో సుమారు 40, 50 మంది కార్మికులు లోపల ఉన్నట్లు సమాచారం. ప్రమాదానికి కొద్ది నిమిషాల ముందే కొంతమంది కార్మికులు భోజనం కోసం షెడ్ల బయటకు రావడంతో వారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. పేలుడు శబ్దానికి వేట్లపాలెం గ్రామంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. పరిసర ప్రాంతమంతా దట్టమైన పొగతో చీకటిమయమైంది.
పరారీలో యజమాని.. ఘటనాస్థలిని పరిశీలించిన ఆర్‌డీవో మల్లిబాబు మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడగా, వారిలో 9 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ పరిశ్రమకు ఈ ఏడాది మార్చి 31 వరకు లైసెన్స్ ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీ యజమాని అడబాల అర్జున్ పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని చెప్పారు.
హాహాకారాలతో దద్దరిల్లిన జీజీహెచ్:
కాకినాడ జీజీహెచ్ (GGH) ఆవరణ బాధితుల బంధువుల రోదనలతో మిన్నంటింది. తమ వారు బతికున్నారో లేదో తెలియక కుటుంబ సభ్యులు తలబాదుకుంటున్నారు. "అమ్మా.. ఎక్కడున్నావ్?" అంటూ నూకళ్ల దేవి అనే కార్మికురాలి కుమార్తెలు రోదిస్తున్న దృశ్యం అందరినీ కన్నీరు పెట్టించింది. గాయపడిన వారిలో కప్పా వెంకట లక్ష్మి, మోర్తా శ్రీను, కె. శ్రీను, చిటికెల లక్ష్మి తదితరులు మృత్యువుతో పోరాడుతున్నారు.
రంగంలోకి ముఖ్యమంత్రి:
సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన ముగించుకుని నేరుగా కాకినాడకు బయలుదేరారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మాజీ సీఎం జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వమే బాధితులకు అత్యుత్తమ వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. మంత్రి నారాయణ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి, తక్షణ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు.
మారిపోని చరిత్ర.. ఆరని మంటలు:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో బాణసంచా ప్రమాదాలు తరచూ జరుగుతూనే వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. 2014లో వాకతిప్పలో జరిగిన ప్రమాదంలో 18 మంది చనిపోయారు.
గతంలో భారీ పేలుళ్లు, విషాదాలు
బాణసంచా తయారీ సందర్భాల్లో అనేక ప్రమాదాలు జిల్లాలో చోటు చేసుకున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని వేట్లపాలెం, జువ్విపాడు, ద్రాక్షారామ, వేళంగి, రాయవరం, వి.సావరం, కొమరిపాలెం, బిక్కవోలు, మండపేట తదితర ప్రాంతాల్లో తయారీ కేంద్రాలున్నాయి. ఏడాది పొడవునా ఇక్కడి వ్యాపారులు బాణసంచా తయారు చేస్తుంటారు. బాణసంచా తయారీ కోసం ఫారమ్‌ 20, కేవలం అమ్మకం కోసం ఫారమ్‌ 24 జారీ చేస్తారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 50కి పైగా లైసెన్స్‌డ్‌ తయారీ కేంద్రాలు ఉన్నాయి.
వాకతిప్పలో 2014 అక్టోబర్‌ 22వ తేదీన చోటు చేసుకున్న ఘటన ప్రమాదంలో 18 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాద ఘటన అనేక లోపాలను ఎత్తిచూపింది.
కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలో కిరాణా షాపులో బాణసంచా పేలి భార్యాభర్తలు కంచర్ల శ్రీనివాసరావు, సీతామహాలక్ష్మి మృతిచెందారు. 2024లో రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్‌ ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన భారీ పేలుడులో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు అక్కడిక్కడే మరణించారు.
గతేడాది రాయవరంలో జరిగిన పేలుడులో ఆరుగురు మరణించారు.
ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా, లైసెన్స్‌లు ఉన్నప్పటికీ భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ బడుగు జీవుల బతుకులు బుగ్గిపాలవుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టర్ షన్మోహన్, ఎస్పీ బిందుమాధవ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది.
Read More
Next Story