
రాయవరం వద్ద దగ్ధమవుతున్న బస్సు
మార్కాపురంలో హాహాకారాలు, గుండెలు తరుక్కుపోతున్న దృశ్యాలు
హరికృష్ణ ట్రావెల్స్ బస్సు దగ్ధం, 20 మంది సజీవ దహనం
ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. తెలంగాణలోని జగిత్యాల నుంచి నెల్లూరు జిల్లా కలికిరి వెళ్తున్న 'హరికృష్ణ ట్రావెల్స్'కు చెందిన ప్రైవేటు స్లీపర్ బస్సు, పలకల క్వారీల వద్ద నిలిచి ఉన్న టిప్పర్‌ను అతివేగంతో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 20 మంది మృతి చెందగా, వారిలో 14 మంది సజీవ దహనమయ్యారు.
ప్రమాదం జరిగిందిలా..
ప్రయాణీకులు ఇంకో గంటలో ఇళ్లకు చేరుకుంటున్నారనుకునే దశలో ఈ ఘోరం జరిగింది. ఉదయం 6:00 నుండి 6:30 గంటల మధ్య ఈ దుర్ఘటన జరిగింది. టిప్పర్‌ను బస్సు బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు, టిప్పర్ రెండు పూర్తిగా దగ్ధమయ్యాయి.
బస్సు కండీషన్ సరిగా లేకపోయినా...
బస్సు పరిస్థితి సరిగా లేదని ప్రయాణికులు ముందే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో యర్రగొండపాలెం వద్ద గంటసేపు మరమ్మతులు చేసిన తర్వాతే బస్సును ముందుకు తీసుకెళ్లారు.
బస్సులోని మొత్తం ప్రయాణీకుల జాబితా
ప్రమాద సమయంలో స్టీరింగ్ స్ట్రక్ (Stuck) అయిందని, అందుకే నియంత్రించలేకపోయానని డ్రైవర్ పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే అతివేగమే ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఎస్పీ ఏమన్నారంటే..
మార్కాపురం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ చేస్తున్నామని ఎస్పీ హర్షవర్ధన్‌రాజు తెలిపారు. ఘటన జరిగిన సమయంలో బస్సు రాంగ్ రూట్‌లో ఉన్నట్టు ప్రాథమికంగా తెలుస్తోందన్నారు. బస్సు, టిప్పర్ రెండూ రాంగ్ రూట్‌లో ఉన్నాయన్నారు. టిప్పర్ డీజిల్ ట్యాంకర్‌ను బస్సు ఢీకొట్టడం వల్ల మంటలు చెలరేగాయని చెప్పారు.
సజీవ దహనం - హృదయవిదారక దృశ్యాలు
ప్రమాద సమయంలో బస్సులో సుమారు 41 మంది ప్రయాణికులు ఉన్నారు. మంటలు క్షణాల్లో వ్యాపించడంతో వెనుక భాగంలో ఉన్న వారు బయటకు రాలేకపోయారు. మృతుల్లో ఎక్కువ మంది స్లీపర్ బెర్తులపై ఉన్నవారే.
గాయపడిన వారి జాబితా
ముందు భాగంలో ఉన్న కొందరు ప్రయాణికులు అద్దాలు పగలగొట్టి దూకి ప్రాణాలు దక్కించుకున్నారు.
క్షతగాత్రులను మార్కాపురంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మరికొందరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
ప్రభుత్వ యంత్రాంగం స్పందన
ఘటనాస్థలాన్ని జేసీ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పరిశీలించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులతో సమీక్ష నిర్వహించి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఏపీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సీఎస్‌ను ఆదేశించారు.
సహాయం కోసం కంట్రోల్ రూమ్ నంబర్లు..
బాధితుల వివరాల కోసం ప్రభుత్వం ఈ క్రింది నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. 6304285613, 9985733999, 7989537285, 9703578434
పరిహారం ప్రకటన
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Next Story

