మార్కాపురం బస్సు ప్రమాదం: ప్రయాణికులు ముందే హెచ్చరించినా..
x

మార్కాపురం బస్సు ప్రమాదం: ప్రయాణికులు ముందే హెచ్చరించినా..

స్టీరింగ్ స్ట్రక్ అయ్యిందని డ్రైవర్ వాంగ్మూలం.


బస్సు కండీషన్ సరిగా లేదు.. ఏదో ప్రమాదం జరిగేలా ఉంది అని ప్రయాణికులు గొంతు చించుకుని మొత్తుకున్నా, ఆ హెచ్చరికలను పెడచెవిన పెట్టిన యాజమాన్యం నిర్లక్ష్యం చివరకు 15 మంది అమాయకుల నిలువు దహనానికి కారణమైంది. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదం వెనుక బస్సు సిబ్బంది మొండితనమే ప్రధాన కారణమని స్పష్టమవుతోంది. యర్రగొండపాలెం వద్దే బస్సు మొరాయించినా, కేవలం తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టి ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయాణాన్ని కొనసాగించడం వల్లే ఈ పెను విషాదం సంభవించింది. స్టీరింగ్ స్ట్రక్ అయ్యిందన్న డ్రైవర్ వాంగ్మూలం, బస్సు అధ్వాన్న స్థితిని ముందే చెప్పినా పట్టించుకోని వైనం ఇప్పుడు బాధిత కుటుంబాల్లో తీరని ఆవేదనను, ఆగ్రహాన్ని నింపుతోంది.

నిర్లక్ష్యమే నిలువునా ముంచింది
ఈ ప్రమాదం వెనుక బస్సు యాజమాన్యం, సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని ప్రయాణికుల ఆరోపణల ద్వారా వెల్లడవుతోంది. ప్రయాణం ప్రారంభమైన కొద్దిసేపటికే బస్సు కండీషన్ సరిగా లేదని, ఏదో లోపం ఉన్నట్లు ప్రయాణికులు గుర్తించి డ్రైవర్‌కు చెప్పారు. ప్రయాణికుల ఆందోళనతో యర్రగొండపాలెం వద్ద బస్సును గంటసేపు నిలిపివేసి చిన్నపాటి మరమ్మతులు చేశారు. అనంతరం ప్రయాణం కొనసాగించిన కొద్దిసేపటికే రాయవరం వద్ద ఈ పెను ప్రమాదం సంభవించింది.
డ్రైవర్ వాంగ్మూలం: అధికారుల ప్రాథమిక విచారణలో, ఒక్కసారిగా స్టీరింగ్ స్ట్రక్ (Steering Stuck) అవ్వడం వల్లే బస్సు నియంత్రణ కోల్పోయిందని డ్రైవర్ తెలిపినట్లు సమాచారం.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ప్రమాద ధాటికి బస్సు పూర్తిగా అస్థిపంజరంలా మారిపోయింది. ఇప్పటి వరకు 13 మృతదేహాలను వెలికితీసిన అధికారులు, క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఈ క్రింది ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది.
సహాయం కోసం ఫోన్ నంబర్లు
6304285613
9985733999
7989537285
9703578434
తీవ్ర విషాదంలో కుటుంబాలు
మృతుల్లో ఎక్కువ మంది పేద కుటుంబాలకు చెందిన వారు కావడంతో ఆయా గ్రామాల్లో విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రయాణికులు ముందే హెచ్చరించినా, బస్సును మార్చకుండా మొండిగా ముందుకు తీసుకెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగిందని మృతుల బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించింది.
Read More
Next Story